ఆమె లెక్క.. 1000 కోట్ల రూపాయలు

  

Last Updated : Nov 11, 2017, 01:04 PM IST
ఆమె లెక్క.. 1000 కోట్ల రూపాయలు

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళతో పాటు ఆమె కుటుంబీకులు దాదాపు 1000 కోట్ల రూపాయలకు పైగా పన్నును ఎగవేశారని ఐటీ అధికారులు తెలిపారు. ఇటీవలే ఆమె ఆస్తులతో పాటు బినామీదార్ల ఇళ్ళను కూడా సోదా చేసిన ఐటీ అధికారులు కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

శశికళ దాదాపు ఓ పది నకిలీ సంస్థలను నెలకొల్పి, ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు ఐటి శాఖ తెలిపింది. ఈ నకిలీ సంస్థలతో పాటు పార్టీ కార్యకలాపాల పేరుతో  శశికళ, ఆమె అనుయాయులు దాదాపు 1000 కోట్ల రూపాయలు ఆదాయపు పన్ను ఎగవేసినట్టు ఐటి శాఖ గుర్తించింది. సంవత్సరం క్రితం నోట్ల రద్దు సమయంలో దేశం మొత్తం అనేక కంపెనీల ద్వారా భారీ ఎత్తున నగదు మార్పిడి కార్యక్రమాలు జరిగినట్లు ఐటి అధికారులు గుర్తించారు.

ఈ కంపెనీల ఆట కట్టించేందుకు "ఆపరేషన్ క్లీన్" చేపట్టారు. ఏ ఏ కంపెనీలు భారీ నగదు మార్పిడి తర్వాత వెంటనే మూసివేయబడ్డాయి... వాటి ద్వారా ఎంత డబ్బు మార్పిడి జరిగింది లాంటి విషయాల మీద డేటా సేకరించారు. ఈ నెలలో శశికళ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న శుక్రా క్లబ్, రెయిన్ బో ఎయిర్ ప్రైవేట్ లిమిటెడ్, ఫెన్సీ స్టీల్ లాంటి కంపెనీలు అర్థాంతరంగా మూతబడటంతో  ఐటి శాఖకు అనుమానం వచ్చి వెంటనే ఆమె ఆస్తులపై సోదాలు నిర్వహించారు.

తమిళనాడు వ్యాప్తంగా 147 చోట్ల వందల మంది ఐటి అధికారుల సమక్షంలో ఈ సోదాలు జరిగాయి. జయా టీవీ కార్యాలయం, నమదు ఎంజీఆర్‌ పత్రిక కార్యాలయంలో కూడా సోదాలు జరిగాయి. అలాగే తంజావూరులోని దినకరన్‌ నివాసంలో పలు ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు సైతం కైవసం చేసుకున్నట్లు సమాచారం. ఆ సోదాల్లో కొన్ని చోట్ల డబ్బు, బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు ఎట్టకేలకు 1000 కోట్ల రూపాయల పన్ను ఎగవేత జరిగిందని తేల్చారు.  

 

Trending News