జకార్తా: ఉగ్రదాడులతో ఇండోనేషియా మరోసారి వణికిపోయింది. ఆదివారం ఇండోనేషియా ఈస్ట్ జావా ప్రావిన్స్‌లోని సురబయ నగరంలోని మూడు చర్చిల వద్ద ముష్కరులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో కనీసం ఐదుగురు చనిపోగా.. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి.. నగరంలోని అన్ని చర్చిలను మూసివేశారు. ఈ మూడు చర్చిల వద్ద ఆదివారం ఉదయం 7 గంటలకు బాంబు దాడి జరిగింది.
మీడియా నివేదికల ప్రకారం, ఇండోనేషియా రెండవ అతిపెద్ద మరియు అత్యంత రద్దీ నగరం నగగెల్ మద్య ప్రాంతంలో శాంటా మేరియా చర్చి వద్ద జరిగిన ఆత్మాహుతి దాడుల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. జీకేఐ డిపోనెగోరో చర్చి వద్ద ఇద్దరు, సురాబాయ సెంటర్ పెంటేకోస్టల్ చర్చి వద్ద మరొకరు మరణించారు. ఈ దాడికి కారకులెవరో ఏ ఉగ్రవాద సంస్థ ఇంతవరకూ పేర్కొనలేదు. పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.