KTR Open Letter: 'బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలన తరువాత కూడాతెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమే!' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 'మేం చేసిన అప్పులతో తెలంగాణ ప్రజల దశాబ్దాల కష్టాలు తీర్చాం. తెలంగాణ దశ దిశను మార్చి రాష్ట్రానికి తరగని ఆస్తులు సృష్టించాం. దేశచరిత్రలోనే అత్యధికంగా అప్పులు చేసిన మీరా మాపై అభాండాలు మోపేది?' అంటూ కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అప్పులన్నీ కార్పొరేట్ శక్తుల లక్షల కోట్ల రుణాల మాఫీ కోసమే అని విమర్శించారు. ప్రతి బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్న బీజేపీని ప్రజలు క్షమించరని తెలిపారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పదేళ్లలో తెచ్చిన రూ.125 లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారో చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
Also Read: IAS Officers: ఐఏఎస్‌లపై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు.. 'ఏసీ గదుల్లో నుంచి బయటకు రావడం లేదు'
పార్లమెంట్‌లో తెలంగాణ అప్పుల రాష్ట్రమని చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. లేఖలో కేంద్రం వైఫల్యాలను ఎత్తిచూపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన మేలును వివరించారు. '14 మంది ప్రధానులు 65 ఏళ్లలో రూ.56 లక్షల కోట్లు అప్పు చేస్తే.. 2014 నుంచి 2024 వరకు కేవలం పదేళ్లలోనే రూ.125 లక్షల కోట్ల అప్పు చేసిన బీజేపీ ప్రభుత్వానికి అప్పులపై మాట్లాడే నైతిక హక్కే లేదు' అని మండిపడ్డారు. తెలంగాణను బలవంతంగా ఆంధ్రలో కలిపిన నాడు కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమేనని కేటీఆర్ స్పష్టంచేశారు.
Also Read: Schools Holiday: ఈనెల 19న పాఠశాలలకు సెలవు.. ఎందుకంటే తెలుసా?
'2014లో తెలంగాణ ఏర్పడిన సమయంలోనూ రాష్ట్రానికి దాదాపు రూ.70 వేల కోట్ల వరకు అప్పు ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని' అని కేటీఆర్ లేఖలో కేంద్ర మంత్రికి సూచించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన తరువాత కూడా తెలంగాణను మిగులు బడ్జెట్ రాష్ట్రంగానే కాంగ్రెస్ పార్టీకి అప్పజెప్పినట్లు వెల్లడించారు. అసలు అప్పులను, మిగులు బడ్జెట్ తో ముడిపెట్టడం సమంజసం కాదని అసహనం వ్యక్తం చేశారు.
'పదేళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం అప్పుగా తెచ్చిన ప్రతి పైసాను పెట్టుబడిగా మార్చి తెలంగాణ నేలపై విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చిన విషయాన్ని యావత్ దేశం చూసింది' అని నిర్మలా సీతారామన్‌కు మాజీ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. 'కేసీఆర్ పాలనలో తెలంగాణ ముఖచిత్రాన్ని, తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని సమూలంగా మార్చి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది' అని కేటీఆర్ వివరించారు. అప్పులున్నంత మాత్రాన ఒక రాష్ట్రం వెనకబడినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం సరైంది కాదని కేంద్ర మంత్రి వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు.
కేంద్రంలో పదకొండేళ్లుగా అధికారంలో ఉన్నా తెలంగాణకు దక్కిందేమీ లేదని లేఖలో కేంద్రమంత్రికి కేటీఆర్ గుర్తుచేశారు. బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎంపీలను గెలిపించినా ఎనిమిది పైసలు కూడా తీసుకురాలేని అసమర్థతను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై బురదజల్లి తప్పించుకోలేరని, బీజేపీ చేసిన తప్పులను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించరని కేటీఆర్ తేల్చిచెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.