KCR Re Entry: తెలంగాణలో ఎన్నికలు ముగిసి సరిగ్గా ఏడాది అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయాల్లో పూర్తిగా ఇన్ యాక్టివ్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో బస్సు యాత్ర చేపట్టి ఒక్కడే ప్రచారం చేపట్టినా ఫలితాలు మాత్రం నిరాశపరిచాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఓటమి తర్వాత ఎర్రవల్లిలోని ఫాం హౌజ్ లోనే కేసీఆర్ గడుపుతున్నారు. అప్పపుడప్పుడు పార్టీ నాయకులు కేసీఆర్ ను ఫాం హౌజ్ లో కలుస్తున్నారు. వచ్చే పోయే నేతలతో సమావేశమవడం తప్పా పెద్దగా బయటకు వచ్చిన సందర్భాలు తక్కువే. కేసీఆర్ రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చిన తర్వాత దశాబ్దాల కాలం తర్వాత ఇలా ప్రజాక్షేత్రంలోకి దూరంగా ఉండడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు.
ఐతే బీఆర్ఎస్ క్యారడ్ మొదలు తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ రాజకీయ రీ ఎంట్రీపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఒక సారి ఎంట్రీ ఇస్తే తెలంగాణ రాజకీయాల స్వరూపమే మారుతుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ప్రస్తుత రాజకీయాల్లో తెలంగాణలో అత్యంత ప్రజాధరణ కలిగిన నేతగా ఇప్పటికీ కేసీఆర్ కు గుర్తింపు ఉంది. ముఖ్యంగా రైతుల్లో కేసీఆర్ పై ఒకింత అభిమానం ఉంది. ఈ వర్గాలు కేసీఆర్ రీ ఎంట్రీనీ బలంగా కోరుతున్నాయి. గత కొద్ది రోజులుగా కేసీఆర్ రీ ఎంట్రీ ఇదిగో అదిగో అంటూ తెగ ప్రచారం జరుగుతుంది కానీ పార్టీ కానీ బీఆర్ఎస్ అధినేత కానీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించిన సందర్భాలు లేవు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కేసీఆర్ రేవంత్ సర్కార్ కు ఒక సంవత్సరం టైం ఇద్దామని అన్నారు. అందుకే ఇప్పటి వరకు కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారనేది బీఆర్ఎస్ శ్రేణుల మాట. డిసెంబర్ తో కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి అవుతున్న తరుణంలో మరోసారి కేసీఆర్ రీ ఎంట్రీ గురించి హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది.
మరోవైపు కేసీఆర్ కాస్తా ఏ పని మొదలు పెట్టినా జాతకాలు చూసి చేస్తారనేది జగమెరిగిన సత్యం. అందులో భాగంగా సంక్రాంతి వరకు మంచి రోజులు లేవని పండితులు చెబుతున్నారు. అంటే సంక్రాంతి లోపు కేసీఆర్ బయటకు వచ్చే అవకాశం లేదు. కేసీఆర్ జాతక రీత్యా కూడా ఇప్పుడు మంచి రోజులు లేవని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాది అంటే 2025లో మార్చిలో శని, ఏప్రిల్ లో గురువు రాశి మారబోతున్నారు. ప్రస్తుతం కుంభ రాశిలో ఉన్న శని 2025 మార్చి 30న మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు .శని స్థానం చలనం కేసీఆర్ కు బాగా కలిసి వస్తుందని కర్కాటక రాశి వారికి వచ్చే ఉగాది తర్వాత బ్రహ్మాండంగా ఉందని కేసీఆర్ జాతకం చూసిన వాళ్లు చెబుతున్నారు. దీనిని బట్టి వచ్చే ఉగాది తర్వాతే గులాబీ బాస్ జనాల్లోకి వస్తారని అందరూ అనుకుంటున్నారు. కాంగ్రెస్ పై ఇప్పుడిప్పుడే వ్యతిరేకత పెరుగుతుందని మరి కొద్ది నెలలు ఆగితే దాని తీవ్రత పెరుగుతుందని అప్పుడు కేసీఆర్ ఎంట్రీ ఇస్తే వార్ వన్ సైడ్ అవుతుందని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు.
ఇది ఇలా ఉంటే కేసీఆర్ రీ ఎంట్రీకీ బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ వేదిక అవుతుందని తెలంగాణ భవన్ లో చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ ప్లీనరీ నుంచి ఇక కేసీఆర్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఆక్టివ్ అవుతారని గులాబీ నేతలు అంటున్నారు. ప్లీనరీయే కేసీఆర్ ఎంట్రీకీ సరైన వేదిక అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అప్పటి వరకు కాంగ్రెస్ పై కేటీఆర్, హరీష్ రావులు పోరాటం కొనసాగిస్తారని ఆ పార్టీలో చర్చ జరుగుతుంది.ఇప్పటికే కాంగ్రెస్ రైతులకు రుణమాఫీ, రైతుబంధు విషయంలో పూర్తిగా విఫలం అయ్యిందని బీఆర్ఎస్ భావన. సాధారణంగానే ఏప్రిల్ మండు వేసవి కాలం లో అలాంటి సమయంలో రైతులకు కరెంట్ కానీ, సాగు నీరు కొరత వచ్చే అవకాశం ఉంది. అప్పుడు కేసీఆర్ ఎంట్రీతో మొత్తం తెలంగాణను తన వైపు తిప్పుకోవచ్చనేది కేసీఆర్ ఆలోచనగా కూడా పార్టీ నేతలు చెబుతున్నారు. అప్పటి వరకు కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వచ్చే అవకాశాలు తక్కువని వారు బల్లగుద్ది చెబుతున్నారు.
బీఆర్ఎస్ నేతల మాటలను బట్టి చూస్తుంటే కేసీఆర్ రీ ఎంట్రీకీ మరి కొద్ది నెలలు పట్టే అవకాశం ఉందని స్పష్టం అవుతుంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టడంలో బీఆర్ఎస్ సక్సెస్ అవుతున్నా కేసీఆర్ ఎంట్రీ ఇస్తే ఇక కాంగ్రెస్ పని ఖతమే అనేది పార్టీలోని కొందరి నేతల ఆలోచన. కేసీఆర్ రీ ఎంట్రీ ఇచ్చే వరకు పార్టీలోని ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ అధికార కాంగ్రెస్ పై పోరాడాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తుంది. మొత్తానికి కేసీఆర్ రీ ఎంట్రీకీ ఇంకా సమయం ఉందనేది బీఆర్ఎస్ వర్గాల సమాచారం. ఒక వేళ కేసీఆర్ కనుక రీ ఎంట్రీ ఇస్తే మాత్రం తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారడం మాత్రం ఖాయం. కేసీఆర్ ఎంట్రీ తర్వాత రేవంత్ రెడ్డి, ఆయన మంత్రుల బృందం ఎలా ఎదుర్కొంటారు, కేసీఆర్ రేవంత్ సర్కార్ కు ఎలా కౌంటర్ ఇస్తారనేది మాత్రం రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter