దీపావళి పండగ భారతదేశంలో హిందువులు జరుపుకొనే విశిష్ట పండుగలలో ఒకటి. ఈ పండగ ప్రతియేటా అమావాస్య రోజున వస్తుంది. ఈ పండుగ ముందురోజును ఆశ్వయుజ బహుళచతుర్దశి లేదా నరక చతుర్దశి అంటారు. చీకటిని తోలుతూ వెలుగులు తెచ్చే పండగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండగ జరుపుకుంటారు.
దీపావళి పండగకు సంబంధించి అనేకానేక కథనాలు ఉన్నాయి. శ్రీమహావిష్ణువు వామనుడిగా శిబిచక్రవర్తిని పాతాళానికి తొక్కినందుకుగానూ, సత్యభామ నరకాసురున్ని సంహరించినందుకు గానూ, శ్రీరాముడు రావణుడిని వధించి అయోధ్యకు చేరుకొని పట్టాభిషిక్తుడైనందుకుగానూ దీపావళి పండగ జరుపుకున్నారని పురాణాలు చెబుతున్నాయి.
దీపావళి పండగను దేశంలోని వివిధ ప్రాంతాలలో ఘనంగా జరుపుకుంటారు. కొత్త బట్టలు ధరించడం, లక్ష్మీదేవి పూజ, ఘుమఘుమలాడే పిండివంటలు, మిఠాయిలు ఇచ్చిపుచ్చుకోవడం, దీపాలు, బాణాసంచా దీపావళి పండగ సోయగాలు.
లక్ష్మీ పూజ ...
దీపావళి పండగ రోజున లక్ష్మీ పూజ చేయడం ఆనవాయితీ. ఇందుకు సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం దుర్వాస మహర్షి ఇంద్రుడి ఆతిథ్యానికి వెళ్లి పూలదండను బహుమతిగా ప్రసాదిస్తాడు. దేవేంద్రుడు తిరస్కార భావముతో ఐరావతం ఏనుగు మెడలో వేస్తాడు. ఐరావతం ఆ పూలదండను తొక్కుతుంది. ఇదంతా గమనిస్తున్న దుర్వాస మహర్షి కోపోద్రిక్తుడై ఇంద్రుణ్ణి శపిస్తాడు. దాంతో ఇంద్రుడు రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని కోల్పోతాడు. శరణుకోసం బ్రహ్మ వద్దకు వెళ్లగా, విష్ణువు వద్దకు వెళ్ళమని సూచిస్తాడు. దేవేంద్రుడు బ్రహ్మ సలహామేరకు విష్ణువు వద్దకు వెళ్లగా, పరిస్థితి గమనించిన ఆయన ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి ప్రార్థించమని చెబుతాడు. లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి రాజ్యాన్ని, అష్టైశ్వర్యాలను పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. కనుకనే దీపావళి పండగ రోజున మాహాలక్ష్మీ ని పూజించేవారికి సిరిసంపదలు చేకూరుతాయని నమ్మకం. అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్ఠాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకునే దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది.
పూజ అయిపోయాక పిల్లలు, యువకులు, పెద్దలు ఉత్సాహంగా బాణాసంచా కాల్చుతారు. కాకార కొవ్వొత్తులు, తారాజువ్వలు, పూల బాణాలు, లక్ష్మీ బాణాలు, చిట్ పట్ లు, పిట్ట బాణాలు, భూచక్రాలు ఇలా రకరకాల పటాకులతో సందడి వాతావరణం నెలకొంటుంది దీపావళినాడు. బాణాసంచా కాల్చే వెలుగులో, శబ్దతరంగాలలో దుఃఖాలు దూరంగా తరిమివేయబడి లక్ష్మీకటాక్షం సిద్దిస్తుందని పురాణాల్లో చెప్పబడింది. అంతేకాక వర్షఋతువులో ఏర్పడిన తేమవల్ల పుట్టుకువచ్చే క్రిమి కీటకాలు బాణాసంచా పొగలకి నశిస్తాయి.
tags: Diwali, lakshmi devi puja, దీపావళి, లక్మీ దేవి పూజ