యూపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చేదు అనుభవం ఎదురైంది. రాహుల్ సొంత నియోజకవర్గమైన అమేథిలో సైతం ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అమేథి నగర పంచాయితీలో కాంగ్రెస్ అభ్యర్ధిపై బీజేపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఇలాగని ఎక్కడైనా గెలుపు సాధించిందా అంటే అదీ సాధ్యంకాలేదు. మొత్తం 16 మేయర్ స్థానాల్లో ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్‌కు దక్కలేదు. గుజరాత్ ఎన్నికల ముందు ఇలాంటి పరిణామం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 2 స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ పుంజుకున్న దాఖలాలు కనిపించలేదు. కాగా తాజా పరిణామాలతో యూపీలో కాంగ్రెస్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి.