7th Pay Commission DA Arrears: 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 18 నెలల పెండింగ్ డీఏపై ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే 18 నెలల డీఏ విడుదలయితే ఒకేసారి భారీ మొత్తంలో డబ్బు అందుతుంది. ప్రస్తుతం ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న అంశం ఇదే.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం త్వరలో 8వ వేతన సంఘం ఏర్పడనుంది. ఇప్పటికే కేంద్ర కేబినెట్ కొత్త వేతన సంఘం ఏర్పాటుకు పచ్చ జెండా ఊపింది. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్ భారీగా పెరగనుంది. అదే సమయంలో కరోనా సమయంలో నిలిపివేసిన 18 నెలల పెండింగ్ డీఏ విడుదల చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. దీనిపై కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వివరణ ఇచ్చారు. కోవిడ్ మహమ్మారి సమయంలో నిలిపివేసిన 18 నెలల పెండింగ్ డీఏను ఇప్పట్లో విడుదల చేయడం లేదని తెలిపారు. పార్లమెంట్ ఉభయసభల్లో ప్రశ్నోత్తరాల సమయంలో లిఖిత పూర్వకంగా ఈ సమాధానమిచ్చారు. కరోనా సమయంలో ప్రభుత్వం ఆర్ధిక భారం తగ్గించే క్రమంలో ఉద్యోగులు, పెన్షనర్లకు చెందిన మూడు డీఏ, డీఆర్లు నిలిపివేశామన్నారు. కోవిడ్ సమయంలో ఆర్ధిక భారం కారణంగా డీఏ నిలిపి వేయాల్సి వచ్చిందన్నారు. ఇప్పుడు తిరిగి ఆ పెండింగ్ డీఏ విడుదల చేయడం లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం డీఏ, డీఆర్ 53 శాతంగా ఉంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం ప్రకారం అందుతోంది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన 8వ వేతన సంఘం 2026 నుంచి అమల్లో రానుంది. ఈలోగా డీఏ మరో రెండు సార్లు పెరుగుతుంది. ప్రస్తుతం జనవరి డీఏ పెంపు ప్రకటన మార్చ్ నెలలో హోలీ నాటికి రావచ్చని అంచనా ఉంది. ఈసారి డీఏ 3-4 శాతం పెరగవచ్చని అంచనా ఉంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్ సమీక్షించేందుకు 8వ వేతన సంఘం ఏర్పాటు చేస్తున్నారు. ఫలితంగా 65 లక్షల మంది పెన్షనర్లు, 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. 2014లో ఏర్పడిన 7వ వేతన సంఘం 2016 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. కొత్త వేతన సంఘం సిఫార్సులు 2025 ఆఖరుకు ఖరారు కానున్నాయి. ఆ తరువాత అమల్లోకి వస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి