8th Pay Commission Salary Hike: కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగనున్నాయి. దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 10వ తేదీన సిబ్బంది & శిక్షణ విభాగం (DoPT), స్టాండింగ్ కమిటీ, జాతీయ మండలి JCM కీలక సమావేశం జరగనుంది.
JCM జాతీయ మండలి (స్టాఫ్ సైడ్) కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా.. అదే రోజు అంతర్గత సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారని సమాచారం. ప్రభుత్వంతో సమావేశానికి ముందు ఈ భేటీలో కీలక అంశాంలపై చర్చించనున్నారు.
8th పే కమిషన్ టర్క్స్ ఆఫ్ రిఫరెన్స్ (ToR)ను ఖరారు చేయడానికి JCM నుంచి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) ఇప్పటికే సూచనలను ఆహ్వానించింది.
DoPT ఆహ్వానం మేరకు.. NC-JCM స్టాఫ్ సైడ్ కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా.. ఉద్యోగుల తరఫున డిమాండ్ల వివరాలను వివరిస్తూ ఒక ప్రతిపాదనను సమర్పించారు. ఇందులో మొత్తం 15 ప్రతిపాదనలు ఉన్నాయి. వీటిలో కీలకమైనది 1-6 వేతన స్థాయిల కింద పే స్కేళ్లను విలీనం చేయాలనే ఆయన కోరారు.
లెవెల్-1ని లెవెల్-2తో.. లెవెల్-3ని లెవెల్-4తో.. లెవెల్-5ని లెవెల్-6తో విలీనం చేయాలనే ప్రతిపాదనను 8వ వేతన సంఘం కమిటీలో పరిగణలోకి తీసుకోవాలని లేఖ రాశారు.
ప్రస్తుత పే స్కేల్ ప్రకారం.. శాలరీ నిర్మాణం [పే మ్యాట్రిక్స్ (సివిలియన్ ఉద్యోగులు)] లెవల్ 1 నుంచి లెవల్ 18 వరకు ఉంటుంది. 7వ పే కమిషన్ కింద.. 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను అన్ని ఉద్యోగులకు ఒకే తరహాలో వర్తింపజేశారు. లెవల్ 1 ఉద్యోగులకు కనీస నెలవారీ జీతం రూ.18 వేలు ఉండగా.. గరిష్టంగా నెల జీతం రూ.2,50 వేలుగా ఉంది.
8వ వేతన సంఘం సిఫార్సులు అమలులోకి వస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 25 నుంచి 30 శాతం.. పెన్షన్లు దామాషా ప్రకారం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.6 నుంచి 2.85 మధ్య ఉంటుందని ప్రచారం జరుగుతోంది.