మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 16న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన మృతిపై సందేహాలను వ్యక్తంచేస్తూ ఎన్డీఏ మాజీ మిత్రపక్షం శివసేన పార్టీ మరోసారి బీజేపీపై పలు విమర్శలు చేసింది. ఎన్డీఏకి దూరమైన తర్వాత అవకాశం చిక్కినప్పుడల్లా బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తోన్న శివసేన తాజాగా మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి మృతిని ప్రస్తావిస్తూ.. తమ పత్రిక సామ్నా ద్వారా మరోసారి బీజేపీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. అసలు వాజ్పేయి ఆగస్టు 16నే మృతి చెందారా లేక అంతకన్నా ముందే ఆయన చనిపోయినా ఆ విషయాన్ని ఆగస్ట్ 16 వరకు ఆ విషయాన్ని దాచిపెట్టి ఆరోజే ఆ ప్రకటన చేశారా అని శివసేన పార్టీ పత్రిక అయిన సామ్నా ఎడిటోరియల్లో ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆగస్ట్ 15న ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జండా ఎగరేసి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇచ్చే సందేశం కోసమే వాజ్పేయి మృతి ప్రకటనను ఆలస్యం చేశారా అని ఎంపీ సంజయ్ రౌత్ బీజేపీని ప్రశ్నించారు.
స్వాతంత్య్ర దినోత్సవం రోజే జాతీయ పతకాన్ని అవనతం చేయడం, సంతాప దినాలు ప్రకటించడం ఇష్టంలేకపోవడంతోపాటు మోదీ ఎర్రకోట ప్రసంగానికి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే వాజ్పేయి ఆగస్ట్ 16 న కన్నుమూశారని ప్రకటించారని సంజయ్ రౌత్ సామ్నా ఎడిటోరియల్లో పేర్కొన్నారు. తమ పార్టీపై తీవ్రమైన ఆరోపణలు చేసిన శివసేనపై బీజేపీ ఏమని స్పందిస్తుందో వేచిచూడాల్సిందే మరి!