Delhi Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు అంటే ఫిబ్రవరి 5న జరగనుంది. ఆప్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొన్నా..ప్రధాన పోటీ మాత్రం ఆప్-బీజేపీ మధ్యే ఉంది. ఢిల్లీ ఎన్నికల్లో ఉద్యోగ వర్గాల ఓట్లే కీలకం కానున్నాయి. వరుసగా నాలుగోసారి పీఠం దక్కించుకునేందుకు ఆప్ ప్రయత్నిస్తుంటే..ఎలాగైనా రాజధానిని కైవసం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 5 అంటే రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లు ఢిల్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 83.49 లక్షల మంది పురుషులు కాగా 71.74 లక్షలమంది మహిళలు ఉన్నారు. ఇక 1261 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేస్తున్నవారి సంఖ్య 2.08 లక్షలు కాగా 20-29 ఏళ్ల యువకుల సంఖ్య 25.89 లక్షలు ఉంది. వందేళ్లు దాటిన ఓటర్లు 830 మంది కాగా 85 ఏళ్లు దాటినవారి సంఖ్య 1.09 లక్షలు ఉన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఉద్యోగ వర్గాల ఓట్లు దాదాపుగా 15 శాతం ఉండవచ్చని అంచనా. ఈ 15 శాతం మంది ఓట్లే విజయాన్ని నిర్ణయించగలవు.
ఈసారి ఢిల్లీలో బీజేపీ, ఆప్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఎవరు గెలిచినా 4- 5 సీట్లే అంతరం ఉండవచ్చని భావిస్తున్నారు. కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తుండటంతో ఎంతో కొంత ఓట్లు చీలవచ్చు. కాంగ్రెస్ ఎన్ని ఓట్లు చీల్చితే అంతగా బీజేపీకు లాభం చేకూరుతుందని విశ్లేషకుల అంచనా. దీనికి తోడు వరుసగా మూడు పర్యాయాలు అధికారంలో ఉండటంతో సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీకు లాభించవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో ఇన్‌కంటాక్స్ విదానంలో చేసిన మార్పులు ఉద్యోగ వర్గాల ఓట్లను తమకు అనుకూలంగా ఉంటాయని బీజేపీ ఆలోచనగా ఉంది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అవినీతిని బీజేపీ ప్రధానాస్త్రంగా మల్చుకుంది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను టార్గెట్ చేస్తోంది. డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో అభివృద్ధి అస్త్రాన్ని సంధిస్తోంది. ఇటు ఆప్ కూడా అందుకు దీటుగా సమాధానమిస్తోంది. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనే ప్రధానాంశాలుగా ముందుకెళ్తోంది. ఆరోగ్యం, విద్య రంగాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన పురోగతిని వివరిస్తోంది.
ఢిల్లీ అసెంబ్లీ బరిలో ఈసారి బడా నేతలు ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌పై పోటీగా మాజీ ఎంపీ సాహెబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మను బీజేపీ నిలబెడితే మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్‌ను కాంగ్రెస్ బరిలో దించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషికి పోటీగా మాజీ ఎంపీ రమేశ్ బిధూరిని బీజేపీ రంగంలో దించింది.
Also read: Champions Trophy 2025 India Squad: ఛాంపియన్స్ ట్రోఫీకు టీమ్ ఇండియా తుది జట్టు ఇదే>
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి