Vangalapudi Anitha Pressmeet: అనకాపల్లి జిల్లా : తనపై సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు తమ ఇష్టం వచ్చినట్టు అవాస్తవ కథనాలు పోస్ట్ చేస్తూ తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా చేస్తున్నారని నక్కపల్లి పోలీస్ స్టేషన్లో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి శనివారం నక్కపల్లి పోలీసు స్టేషన్ కి వెళ్లిన వంగలపూడి అనిత.. అక్కడ స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ నారాయణ రావుని కలిసి పలువురు వైసీపీ నాయకులతో పాటు ఆ పార్టీ సోషల్ మీడియా విభాగంపై పిర్యాదు చేశారు. తన ఫిర్యాదును స్వీకరించి తక్షణమే కేసు నమోదు చేయాలని సీఐ నారాయణ రావును వంగలపూడి అనిత విజ్ఞప్తి చేశారు.
నక్కపల్లి సీఐ నారాయణ రావుకి ఫిర్యాదు చేసిన అనంతరం తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అనిత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ, తనపై లేని పోని పోస్టులను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వై.ఎస్.భారతి రెడ్డి పి.ఏ వర్రా రవీందర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అని తెలిపారు. వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలుగు దేశం పార్టీ చేస్తోన్న విమర్శలకు సమాధానాలు చెప్పలేక పేటియం బ్యాచ్ హెడ్‌గా ఉన్న సజ్జల భార్గవ రెడ్డి ద్వారా పేటియం బ్యాచ్‌తో నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆరోపించారు.
వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల తరహాలో తెలుగు దేశం పార్టీ నాయకులు , కార్యకర్తలు డబ్బు ఆశించరని అన్నారు. పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు ఈ వైసీపీ నేతలు కూడా తాము చేస్తోన్న తప్పులే అందరూ చేస్తున్నారని అనుకోవడం విడ్డురంగా ఉందన్నారు. ఒక తెలుగు మహిళను కించపరుస్తూ వైసీపీ పేటియం బ్యాచ్ చేస్తున్న విమర్శలను, సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులను ఖండించడానికి వైసీపీ మహిళా నేతలు వాసిరెడ్డి పద్మకు కానీ , లేదా హోం మినిష్టర్ తానేటి వనితకు గాని నోరు రావడం లేదని వంగలపూడి అనిత మండిపడ్డారు.