పాకిస్తాన్ మరోసారి ముంబై దాడుల సూత్రధారి, కరడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కి భద్రత కల్పిస్తూ అధికారికంగా ఆదేశాలు జారీచేసింది. జమాత్-ఉద్ దవా ఉగ్రవాద సంస్థ అధినేత హఫీజ్ సయీద్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే కారణంతో పాకిస్తాన్‌లోని పంజాబ్ ఫ్రావిన్స్ ప్రభుత్వం అతడికి తిరిగి భద్రతను కల్పించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నెల రోజుల క్రితమే హఫీజ్ సయీద్‌కి భద్రతను ఉపసంహరించుకున్న పాక్ మళ్లీ తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనియాంశమైంది. పంజాబ్ ముఖ్యమంత్రి షాహబాజ్ షరీఫ్ ఆదేశాల మేరకు అక్కడి పోలీసులు హఫీజ్ సయీద్ ఇంటి చుట్టూ రక్షణ కవచంగా నిలిచారు. ఈ మేరకు పంజాబ్ ఉన్నతాధికారి ఒకరు పీటీఐతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. హఫీజ్ సయీద్ అంతు చూస్తామని బెదిరింపులు వస్తోన్న నేపథ్యంలోనే పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సదరు అధికారి తెలిపారు.
బలమైన కారణం లేనిదే అనర్హులకు భద్రత కల్పించకూడదని, ఇప్పటివరకు అలా రక్షణ పొందుతున్న వారి నుంచి భద్రతను ఉపసంహరించుకోవాలని పేర్కొంటూ నెల రోజుల క్రితం పాక్ సుప్రీం కోర్టు ఇస్లామాబాద్ సహా మరో నాలుగు రాష్ట్రాల ఇన్స్పెక్టర్ జనరల్స్కి ఆదేశాలు జారీచేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల అనంతరం పంజాబ్ ప్రభుత్వం పలువురికి అందిస్తున్న భద్రతను ఉపసంహరిస్తున్నట్టు ఆదేశాలు జారీచేస్తూ దాదాపు 4,610 మంది భద్రతా సిబ్బందిని వెనక్కి పిలిపించుకుంది.