Kamareddy MLA Election: కామారెడ్డిలో కేసిఆర్‌ ఇక గెలిచినట్టేనా ?

Kamareddy MLA Election: కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ కు అనుకూలంగా ఓటేస్తామంటూ 10 గ్రామాల ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. స్వయంగా కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు రావడం ఏకగ్రీవ తీర్మానాలు చేయడం సంతోషంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. 

Written by - Pavan | Last Updated : Aug 27, 2023, 07:54 AM IST
Kamareddy MLA Election: కామారెడ్డిలో కేసిఆర్‌ ఇక గెలిచినట్టేనా ?

Kamareddy MLA Election News: కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ కు అనుకూలంగా ఓటేస్తామంటూ 10 గ్రామాల ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలంలో ఉన్న ఎల్లంపేట, అంకిరెడ్డిపల్లి, నడిమి తండా, వెనుక తాండ, బోడగుట్ట తండా, మైసమ్మ చూరు, రాజకన్ పెట్, వడ్డెర గూడెం, గుంటి తండా, దేవునిపల్లి గ్రామపంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించాయని తెలుస్తోంది. శనివారం నాడు మాచారెడ్డి మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో కలిసి సంబంధిత తీర్మాన ప్రతులను అందించారు. 

ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.... స్వయంగా కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు రావడం ఏకగ్రీవ తీర్మానాలు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేయాలని పార్టీ నిర్ణయించిందని చెప్పారు. ఆ నిర్ణయం వల్ల రెండు నియోజకవర్గాలనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా నూతన ఉత్సాహం వచ్చిందని అన్నారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి రావడం వల్ల కేవలం కామారెడ్డి జిల్లాకే కాకుండా ఉమ్మడి నిజామాబాద్ తో పాటు పొరుగున ఉన్న నాలుగైదు జిల్లాలు అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగుతాయని తాను విశ్వసిస్తున్నానని స్పష్టం చేశారు.

నిజామాబాద్ బిడ్డగా సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయడానికి తాను స్వాగతిస్తున్నానని, అందరిలానే తనకు కూడా ఉత్సాహంగా ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్‌కే ఓట్లు వేస్తామని ఏకగ్రీవంగా తీర్మానాలు చేయడం చాలా అద్భుతంగా అనిపిస్తోందని, ఏకగ్రీవ తీర్మానాలు చేసిన పది గ్రామాల ప్రజలకు కవిత ధన్యవాదాలు తెలియజేశారు. కారుకు ఎదురు లేకుండా సాగిపోయేటట్టుగా ఈ 10 గ్రామాల ప్రజలు ఉత్సాహాన్ని ఇచ్చారని, ఇదే ఉత్సాహం ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు ఉండేదని చెప్పారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి లో పోటీ చేస్తే మరింత అభివృద్ధి అవుతుందన్న ఉద్దేశంతో గంప గోవర్ధన్ కేసీఆర్ ను ఆహ్వానించారని వివరించారు. 

పార్టీలకు అతీతంగా మాచారెడ్డి మండలంలోని గ్రామపంచాయతీలు తీర్మానం చేశాయని, షబ్బీర్ అలీ వంటి వారు ఎన్ని మాట్లాడినా ప్రజలు సీఎం కేసీఆర్ ను పార్టీలకు , కులాలకు,  మతాలకు అతీతంగానే చూస్తారని తేల్చి చెప్పారు. కామారెడ్డి లోని సబండ వర్గాల ప్రజలు కెసిఆర్ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. కెసిఆర్ బోలా శంకరుడు అని, ఆయనకు ఆయన చేతికి ఎముకంటూ ఉండదని, కాబట్టి కామారెడ్డి తో పాటు పరిసర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. సీఎం కేసీఆర్ గెలుపుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో ఈనెల 28న కామారెడ్డిలో భారీ సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో తాను కూడా పాల్గొంటానని వెల్లడించారు. ఎన్నికలు కాబట్టి పోటీ ఉన్నా లేకున్నా పని చేసుకుంటూ వెళ్లాలని, ఇంటింటికి వెళ్లి టిఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలన్న విషయాన్ని వివరించాలని నాయకులకు కార్యకర్తలకు కవిత దిశానిర్దేశం చేశారు. కామారెడ్డి ప్రజలు పౌరుషాన్ని చూపించడానికి ఇది సమయం అని తెలిపారు. గజ్వేల్ కన్నా ఒక్క ఓటు అన్న ఎక్కువ మెజారిటీ తెప్పించి చూపించాలని అన్నారు. 

ఇది కూడా చదవండి : SC, ST Decleration: చేవెళ్ల ప్రజాగర్జన సభలో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

అవార్డులు వచ్చిన గ్రామపంచాయతీలకు కవిత అభినందనలు తెలిపారు. రాజకీయంగా మనల్ని వ్యతిరేకిస్తున్న పార్టీలు కూడా మన గ్రామాల అభివృద్ధిని ప్రశంసిస్తున్నాయని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మన పల్లెల అభివృద్ధిని చూసి అవార్డులు సైతం ఇస్తున్నాయని తెలిపారు. గ్రామాలు పట్టణాలు బాగుండాలన్న కెసిఆర్ పట్టుదలతోనే ఇవన్నీ సాధ్యమయ్యాయి అని వివరించారు. కామారెడ్డికి కాలేశ్వరం ప్యాకేజీ 22 ద్వారా నీళ్లు వస్తాయని, సిరిసిల్ల నుంచి కూడా నీటిని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కవిత వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బిబి పాటిల్, కార్పొరేషన్ల  చైర్మన్లు అయాచితం శ్రీధర్, మఠం బిక్షపతి, మేడే రాజీవ్ సాగర్, మాచరెడ్డి ఎంపీపి నర్సింగ్ రావ్, గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యం రావ్, మండల పార్టీ అధ్యక్షుడు బాల్ చంద్రం, కామారెడ్డి సీనియర్ నాయకులు తిరుమల రెడ్డి పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x