దసరా పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ఇవాళ లాంఛనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం దేవుళ్ల చిత్రపటాలపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి సతీమణి సురేఖ క్లాప్ కొట్టారు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాంటి సందేశాత్మక చిత్రాలు తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న కొరటాల శివ.. చిరు 152వ సినిమా కోసం కూడా పలు సామాజిక అంశాలతోనే స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఖైదీ నెంబర్ 150, సైరా నర్సింహా రెడ్డి చిత్రాల తర్వాత కొణిదెల ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తోన్న మరో సినిమా ఇదే. మెగా ఫ్యాన్స్‌కి వచ్చే ఏడాది ఉగాది కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చిరంజీవి, రామ్‌చరణ్, కొరటాల శివతో పాటు చిరు మాతృమూర్తి అంజనీ దేవి, సురేఖ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదిలావుంటే, చిరంజీవి లేటెస్ట్ సెన్సేషన్ సైరా నరసింహారెడ్డి బాక్సాఫీస్ బరిలో భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఒకవైపు భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమా కావడం, మరోవైపు దసరా వరుస సెలవులు కావడంతో అనేకచోట్ల థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.