TTD War: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనతో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్లక్ష్యం, ఆధిపత్య పోరు, ఈగో అన్నీ బయటపడ్డాయి. జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేస్తుంటే పాలకమండలి వర్సెస్ అధికారుల వైరం బయటికొచ్చింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వర్సెస్ టీటీడీ ఈవో శ్యామలరావు ఒకరినొకరు ఏకవచనంతో కోట్లాటకు దిగారు.
టీటీడీలో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. తొక్కిసలాట ఘటనతో అధికారుల మద్య వైరమే కాకుండా పాలకమండలి వర్సెస్ అధికారుల వైరం, ఈగో బయటపడింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇరువురూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందే వాగ్వాదానికి దిగిన పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై సమీక్ష చేస్తుండగా చంద్రబాబు సమక్షంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవీ శ్యామలరావు ఒకరినొకరు వాగ్వాదం చేసుకుంటూ నువ్వు నువ్వంటూ ఏకవచనంలో దిగడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. చంద్రబాబు సైతం ఈ ఘటనపై నివ్వెరపోయినట్టు తెలుస్తోంది. టీటీడీలో ఉన్న లోపాలు ఆయనకు స్పష్టంగా అర్ధమయ్యాయి. టీటీడీ ఛైర్మన్ వర్సెస్ ఈవో మధ్య సమన్వయం లేదని అర్ధమైంది. అసలేం జరిగిందంటే...
నువ్వంటే నువ్వంటూ ఏకవచనం
ముఖ్యమంత్రి సమీక్ష చేస్తుండగా టీటీడీ ఛైర్మన్ కలగజేసుకుని ఈవోతో నువ్వు నాకేం చెప్పడం లేదనడంతో అన్నీ చెబుతూనే ఉన్నామంటూ ఈవో శ్యామలరావు సమాధామిచ్చారు. తనను ఈవో పట్టించుకోవడం లేదని, ఛైర్మన్ అనే గౌరవం చూపించడం లేదన్నారు. ఏ చిన్న విషయాన్ని తనతో చర్చించడం లేదని చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దాంతో అసహనానికి లోనైన ఈవో శ్యామలరావు నీకే విషయం చెప్పడం లేదు...అన్నీ చెబుతూనే ఉన్నాం కదా అని అనడంతో ఇక ఇద్దరూ నువ్వు నువ్వంటూ వాదులాడుకున్నారు.
ఈ పరిణామంతో చంద్రబాబు సైతం నివ్వెరపోయారు. ముఖ్యమంత్రి ముందు ఎలా మాట్లాడాలో తెలియదా అని మండిపడ్డారు. ఈవోను మందలిస్తూ ఛైర్మన్ బీఆర్ నాయుడిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇద్దరూ పరిధి దాటుతున్నారు, ఎవరి మీద ఫ్రస్టేషన్ చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిందేంటి, మీరు మాట్లాడుతున్నదేంటని మండిపడ్డారు. ఇద్దరూ సమన్వయంతో ఉండాలని మందలించారు. ఇదే అదనుగా ఏఈవో వెంకన్న చౌదరిపై కూడా ఆరోపణలు రావడంతో అన్నింటిపై నిర్ణయం తీసుకుంటామనడం విశేషం. ఇప్పుడీ ఘటనలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వర్సెస్ ఈవో శ్యామలరావు వర్సెస్ ఏఈవో వెంకన్న చౌదరిలో ఎవరిపై వేటు పడుతుందోననే చర్చ మొదలైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.