Nepal Govt Bans Tiktok: ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌ను నేపాల్ బ్యాన్ చేసింది. ద్వేషపూరిత ప్రసంగాలను వ్యాప్తికి కారణమవుతుందన్న ఉద్దేశంతో నేపాల్ ప్రభుత్వం సోమవారం నిషేధాన్ని ప్రకటించింది. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో టిక్‌టాక్‌ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు దేశ కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రేఖా శర్మ తెలిపారు. అయితే ఈ నిర్ణయం ఎప్పుడు అమల్లోకి వస్తుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. సామాజిక సామరస్యంపై నెగిటివ్ ఇంపాక్ట్ చూపుతున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం చైనీస్ షార్ట్-ఫారమ్ వీడియో యాప్ టిక్‌టాక్‌పై నిషేధం విధించాలని నిర్ణయించినట్లు స్థానిక మీడియా కూడా వెల్లడించింది.
"టిక్‌టాక్‌ని నిషేధించే నిర్ణయం త్వరలో అమలులోకి వస్తుంది. అయితే ఎంత కాలం నిషేధం అమల్లో ఉంటుందనే తెలియదు." మంత్రి రేఖా శర్మ వెల్లడించారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్, టిక్‌టాక్ ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు దేశంలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని నేపాల్ ప్రభుత్వం ఇటీవల తప్పనిసరి చేసింది. ఇంతలోనే టిక్‌టాక్ యాప్‌పై బ్యాన్ విధించడం ఆసక్తి రేకిత్తిస్తోంది. నేపాల్‌కు కంపెనీల ప్రతినిధులు గైర్హాజరు కావడం.. వినియోగదారుల సమస్యలను పరిష్కరించడం, ప్లాట్‌ఫారమ్‌ల నుంచి అభ్యంతరకరమైన కంటెంట్‌ను తొలగించాలంటే అధికారులకు కష్టంగా మారడంపై పెరుగుతున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
నేపాల్ నిబంధనల ప్రకారం.. దేశంలో పనిచేస్తున్న అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఆదేశాలు అమలులోకి వచ్చిన మూడు నెలల్లోగా నేపాల్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. లేదా ప్రత్యేక ప్రతినిధిని తమ దేశంలో నియమించాలి. అంతేకాకుండా ఈ కంపెనీలు తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో రిజిస్టర్ చేసుకోవాలి. నిబంధనలు పాటించడంలో విఫలమైనా.. నేపాల్ అధికార పరిధిలో సరైన రిజిస్ట్రేషన్ లేకపోయినా మంత్రిత్వ శాఖకు మూసివేసే అధికారం ఉంటుంది.
టిక్‌టాక్ యాప్‌ను ఇప్పటికే మన దేశంలో నిషేధించిన విషయం తెలిసిందే. చైనీస్ టెక్ దిగ్గజం బైట్‌డాన్స్ యాజమాన్యంలోని ఈ షార్ట్ వీడియో యాప్‌కు మన దేశంలో భారీ క్రేజ్ ఉండేది. అయితే జాతీయ భద్రతా సమస్యల కారణంగా జూన్ 29, 2020న కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ యాప్ 2016 సెప్టెంబర్ నెలలో ప్రారంభంకాగా.. భారత్‌లో ఎక్కువ మందిని ఆకర్షించింది. ఈ టిక్‌టాక్ యాప్‌తో ఎంతోమంది తమ టాలెంట్‌ను నిరూపించుకుని సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. కొంతమంది సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకున్నారు. యాప్‌పై నిషేధం విధించిన తరువాత యూట్యూబ్ ఛానెల్స్ క్రియేట్ చేసుకుని.. ఆ క్రేజ్‌తో సెటిల్ అయిపోయారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook