కరోనా వైరస్ . . ప్రపంచాన్ని గజగజా వణికిస్తున్న మహమ్మారి ఇది. వేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ దెబ్బకు ఏకంగా మృతుల సంఖ్య 904కు చేరింది. చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సంఖ్య ఇది. కానీ అనధికారికంగా ఇంకా మృతుల సంఖ్య ఎక్కువగా ఉందనే వాదన వినిపిస్తోంది.
చైనాలోని హుబీ రాష్ట్రంలో ఈ రోజు మరో 91 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 2 వేల 618 మంది పాజిటివ్ లక్షణాలతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు చైనా అంతటా హెల్త్ ఎమర్జెన్సీ కొనసాగుతోంది. మొత్తంగా చైనాలో కరోనా వైరస్ బారిన పడ్డ వారు 39 వేల 800 వరకు ఉన్నారు. వారికి దేశంలో వివిధ ఆస్పత్రులలో చికిత్స అందిస్తున్నారు.
చైనాలో కరోనా వైరస్ వ్యాప్తిని ఆకట్టుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్యలు చేపట్టింది. ఇప్పటికే చైనా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను WHO అభినందించింది. ఐతే ఇప్పటికీ పరిస్థితి దారుణంగానే ఉందని తెలిపింది. WHO తరఫున అంతర్జాతీయ నిపుణుల బృందం చైనా బయల్దేరి వెళ్లింది.