BRS MLAs: సీఎంను కలిస్తే తప్పేంటి..? కాంగ్రెస్‌లో చేరికపై నలుగురు ఎమ్మెల్యేలు క్లారిటీ

Telangana Politics: పార్టీ మార్పుపై నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పందించారు. తాము నియోజకవర్గాల సమస్యలపై కలిశామని.. పార్టీ ఉద్దేశం తమకు లేదన్నారు. తమకు రాజకీయ భవిష్యత్ ఇచ్చిన బీఆర్ఎస్‌ను, కేసీఆర్‌ను వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.    

Written by - Ashok Krindinti | Last Updated : Jan 24, 2024, 03:51 PM IST
BRS MLAs: సీఎంను కలిస్తే తప్పేంటి..? కాంగ్రెస్‌లో చేరికపై నలుగురు ఎమ్మెల్యేలు క్లారిటీ

Telangana Politics: ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రేవంత్‌ రెడ్డి నివాసంలో సమావేశమైన తరువాత.. ఈ నలుగురు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి, జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌ రావు ఉన్నారు. పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నలుగురు ఎమ్మెల్యేలు క్లారిటీ ఇచ్చారు. 

ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ.. హామీల పై కాంగ్రెస్ కప్పదాటు వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. చాలా అంశాల్లో ప్రభుత్వానికి స్పష్టత లేదని విమర్శించారు. మహాలక్ష్మి, యువ వికాసం గ్యారంటీలు ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశార. తన నియోజకవర్గంలో ప్రొటో కాల్ వివాదాలపై ఆ రోజే  చెప్పానని.. ఇదే అంశంపై ఐజీ శివధర్ రెడ్డిని, సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని చెప్పారు. తాము పార్టీ మారే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ప్రజలలో కొందరు గందర గోళం సృష్టిస్తున్నారని.. అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తమ అధిష్టానానికి తమ మీద సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. తాము కేసీఆర్ వెంటే ఉంటామన్నారు. మెదక్  గులాబీ జెండాకు పుట్టినిల్లు అని.. కేసీఆర్ సారథ్యంలో మెదక్ పార్లమెంటు నియోజకవర్గాన్ని గెలుచుకుంటామన్నారు. తమ మీద దుష్ప్రచారం కొనసాగిస్తే పరువు నష్టం దావాలకు వెనుకాడమని హెచ్చరించారు. 

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గం సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డిని కలిశామన్నారు. సీఎం రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు కదా అని ప్రశ్నించారు. సీఎంను కలిసినంత మాత్రాన తామేదో పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ఓ ఎండ్రికాయల పార్టీ అని.. అందులో ఎవరు చేరుతారు..? అని ప్రశ్నించారు. మెదక్ ఉద్యమాల గడ్డ.. ఉద్యమంలో కేసీఆర్‌తో ఉన్నామన్నారు. ఇక ముందు కూడా ఉంటామన్నారు. కాంగ్రెస్ వాళ్లే ఈ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సమస్యలపై ఎస్పీని, కలెక్టర్‌ను ఇదివరకే కలిశామన్నారు. వాటికి కొనసాగింపుగానే శివధర్ రెడ్డిని, సీఎం రేవంత్‌ను కలిశామన్నారు. తాను బతికున్నంత కాలం బీఆర్ఎస్‌ను వీడనని అన్నారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు ఖండిస్తున్నానని చెప్పారు. కేసీఆర్ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని.. ఆయనను వీడనని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం కేసీఆర్ హయంలో జోడెడ్లలా సాగిందన్నారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి తమ రాజకీయాలకు  సంబంధం లేదన్నారు. 

ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ.. తాము సీఎంను కలిసింది  ప్రజల పరిష్కారం కోసమేనన్నారు. సీఎం కేసీఆర్‌గా ఉన్నపుడు  సంగమేశ్వర, బసవెశ్వర లిఫ్ట్ పథకాలు జహీరాబాద్‌కు మంజూరు చేశారని అన్నారు. జరుగుతున్న పనులను ఆపాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. ఇలాంటి వాటికి ఆస్కారం ఇవ్వొద్దని సీఎం రేవంత్‌ను కోరినట్లు చెప్పారు. మున్సిపాలిటీలకు కేటాయించిన నిధులు ఆపుతున్నారని.. ఆపొద్దని సీఎంను కోరానన్నారు. తాను పుట్టింది బీఆర్ఎస్‌లోనే..  చచ్చేది బీఆర్ఎస్‌లోనే.. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం కోసం గట్టిగా కృషి చేస్తానన్నారు.

Also read: Shani Dev: ఏలినాటి శని తొలగిపోవాలంటే ఈ చిన్నపరిహారం చేయండి.. శనిభగవాణుడు ప్రసన్నమైపోతాడట..!

Also read: UPI New Changes 2024: యూపీఐలో మార్పులు, రోజుకు లిమిట్, పేమెంట్ ఛార్జీలు ఇలా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News