సౌతాఫ్రికా మాజీ కెప్టేన్, అంతర్జాతీయ క్రికెట్లో విధ్వంసకరమైన బ్యాట్స్ మేన్‌గా పేరున్న ఏబీ డివిలియర్స్ నిన్న బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్ మెంట్ ప్రకటిస్తే, కేవలం సౌతాఫ్రికా క్రికెట్ అభిమానులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వున్న క్రికెట్ ప్రియులు షాక్ కి గురయ్యారు. ఇక ఇంటర్నేషనల్ పిచ్ లపై ఈ విధ్వంసకరమైన బ్యాటింగ్ ని చూడలేమా అని ఒకింత ఆవేదనకు గురయ్యారు. అంతర్జాతీయ క్రికెట్ కి డివిలియర్స్ వీడ్కోలు పలికితే అంతమంది ఆవేదనకు గురయ్యారంటే అదేమీ అతడు అంత ఈజీగా సంపాదించుకున్న అభిమానం కాదు అని అర్థమైపోతుంది. వన్డే క్రికెట్ లో డివిలియర్స్ కి ఎన్నో రికార్డులు వున్నాయి. ఫాస్టెస్ట్ 50 (16 బంతుల్లో), ఫాస్టెస్ట్ 100 (31 బంతుల్లో), ఫాస్టెస్ట్ 150 (64 బంతుల్లో) చేసిన ఎకైక క్రికెటర్ డివిలియర్స్ మాత్రమే. అందుకే అతడంటే అందరికీ అంత అభిమానం. డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా ఐసీసీ సైతం అతడు గొప్పగా ఆడిన ఇన్నింగ్స్‌కి సంబంధించిన ఓ వీడియోను ట్విటర్ ద్వారా షేర్ చేసుకుని అతడి అభిమానులని ఆనందంలో ముంచెత్తింది.
66 balls
17 fours
8 sixes
162 not out!@ABDeVilliers17's finest innings?#ABRetires pic.twitter.com/1qOsHia5PT— ICC (@ICC) May 23, 2018
దక్షిణాఫ్రికా తరపున 123 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన డివిలియర్స్ అందులో 22 సెంచరీలు చేశాడు. ఈ టెస్ట్ మ్యాచ్‌ల్లో డివిలియర్స్ స్కోర్ చేసిన మొత్తం పరుగులు 8,765. అతడి వన్డే కెరీర్ విషయానికొస్తే, 228 వన్డే మ్యాచ్‌లు ఆడిన ఈ సౌతాఫ్రికా మాజీ కెప్టేన్.. అందులో 25 సెంచరీలు చేశాడు. వన్డేల్లో డివిలియర్స్ చేసిన మొత్తం పరుగులు 8,577.