కేసీఆర్ హయాంలో గత నాలుగేళ్లుగా జరిగిన కుంభకోణాలపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుదాకరరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక ఎంసెట్, మియాపూర్ భూముల కుంభకోణం, నయీం ఎన్కౌంటర్ స్కాం.. ఇలా చాలా స్కాములు బయటికి వచ్చాయని, వీటిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. రాజకీయ ఎజెండాలో భాగంగానే కాంగ్రెస్ నేతలపై మళ్లీ కేసులు పెట్టాలని కేసీఆర్ చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
సబ్సిడీ పథకాల్లో జరుగుతున్న కుంభకోణంపై కూడా విజిలెన్స్ విచారణ జరిపితే నిజాలు బయటికి వస్తాయన్నారు. ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్కు రహస్య ఒప్పందం జరిగిందని, దానిమేరకే ఆయన పనిచేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలపై ఉన్న కేసులను సమీక్షించడం వెనుక కుట్ర దాగుందని పొంగులేటి విమర్శించారు. విభజన చట్టం హామీలపై సుప్రీంకోర్టులో తాను వేసిన కేసు మూడోసారి విచారణకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.