మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ప్రాంతంలో శ్రీమత్ మహారాజా మాధవరావు సింథియా ప్రభుత్వ ఆసుపత్రిలో నిధుల కొరత కొట్టొచ్చిన్నట్లు కనిపిస్తోంది. కనీసం తమవద్దకు వచ్చే రోగులకు ఎక్స్ రే సేవలు కూడా అందజేయలేని పరిస్థితిలో ఉంది ఆ ఆసుపత్రి. అందుకే తెల్లకాగితాలపైనే ఎక్స్ రే ప్రింట్ తీస్తూ.. వాటిని రోగులకు అందజేస్తున్నారు పారామెడికల్ స్టాఫ్.
నిధుల కొరత వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఇప్పటికే ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. అయితే మీడియాలో ఇలా తెల్లకాగితాలను ఉపయోగించి ఎక్స్ రే తీస్తున్నారనే విషయం బయటకు రావడంతో.. ఆసుపత్రి వర్గాలు ఎక్స్ రే సేవలు పూర్తిగా బంద్ చేశాయి. డిజిటల్ ఫిల్మ్ కొరత వల్ల ఎక్స్ రే సేవలు నిలిపివేసినట్లు ఆసుపత్రి నోటిసు బోర్డులో ప్రకటనను విడుదల చేశాయి.
అయితే ఆసుపత్రి యాజమాన్యం చేసింది ముమ్మాటికి తప్పేనని, ఎక్స్ రే తీయడానికి తెల్ల కాగితాలను ఉపయోగించడం సబబు కాదని.. తాము తప్పకుండా ఆ ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి ఎస్ ఎస్ బిల్వర్త్ తెలిపారు. పేదల పెన్నధిగా పేరుగాంచిన ఆ ఆసుపత్రిలో ఎక్స్ రే సేవలు నిలిచిపోవడంతో పేద రోగులు ఎనలేని ఇబ్బందులు పడుతున్నారు.