Ex Minister RK Roja: చిత్తూరు జిల్లా నగరిలో మాజీమంత్రి రోజాకు చెక్ పెట్టేందుకు సొంత పార్టీ లీడర్లే పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. నగరిలో ఆర్కే రోజాకు చెక్ పెట్టేందుకు గాలి జగదీష్‌ను వైసీపీకిలోకి ఆహ్వానించారని జోరుగా ప్రచారం సాగుతోంది. గాలి జగదీష్‌ను వైసీపీలోకి తీసుకురావడం ద్వారా రానున్న రోజుల్లో రోజాను పార్టీ నుంచి సాగనంపవచ్చని కొందరు నేతలు ప్లాన్ వేసినట్టు ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజులుగా నగరి ఎమ్మెల్యేగా గాలి భానుప్రకాశ్‌కు ఆయన సోదరుడు గాలి జగదీష్ అస్సలు పడటం లేదు.. ఇద్దరికి మధ్య రాజకీయ పోరు నడుస్తోంది. దాంతో జగదీష్‌ను మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలోకి ఆహ్వానించారని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది.
ఇక కొన్నేళ్లుగా చిత్తూరు జిల్లాలో మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా మధ్య ఆధిపత్యపోరు సాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఇద్దరు నేతలు నువ్వానేనా అన్నట్టుగా పోరు సాగించారు. అయితే నగరిలో రోజాకు చెక్ పెట్టేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. ఇది సాధ్యపడలేదు.. అయితే చాలా రోజులుగా ఈ చాన్స్‌కోసం ఎదురుచూసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఇప్పుడు గాలి జగదీష్ రూపంలో రోజాకు చెక్ పెట్టేందుకు రెడీ అయ్యారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. గాలి జగదీష్‌ను వైసీపీలో చేర్చుకోవడమే కాదు.. ఆయనకు నగరి ఇంచార్జ్ బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు..
ప్రస్తుతం గాలి భానుప్రకాశ్ నాయుడు నగరి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నగరిలో ఆయన రోజాను చిత్తుచిత్తుగా ఓడించారు. అప్పట్లో గాలి సోదరుల మధ్య అసెంబ్లీ టికెట్ పోరు నడిచింది. కానీ చివరకు చంద్రబాబు.. గాలి భాను ప్రకాశ్ నాయుడు వైపే మొగ్గుచూపారు. దాంతో గాలి జగదీష్ రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఆయన వైసీపీ స్వాగతం పలికింది. కానీ ఈ విషయాన్ని రోజాకు చెప్పకపోవడంతో ఆమె నిప్పులు చేరిగినట్టు సమాచారం. తన సొంత ఇలాకాలో ఓ నేతను చేర్చుకునే విషయాన్ని తనకు కూడా చెప్పకుండా ఎలా చేర్చుకుంటారంటూ మండిపడ్డారని తెలుస్తోంది. జగదీష్ చేరిక వెనుక మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని నేరుగా విమర్శలు గుప్పిస్తుండటం చర్చనీయాశంగా మారింది.
అయితే గాలి జగదీష్ చేరిక విషయంలో పార్టీ హైకమాండ్‌ను ఫిర్యాదు చేసే యోచనలో రోజా ఉన్నట్టు సమాచారం. జగదీష్ చేరిక విషయంలో కీలకంగా ఉన్న మాజీమంత్రిని కట్టడి చేయాలని కూడా పార్టీ అధినేతకు వివరించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే రోజా ఫిర్యాదుపై జగన్ ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. ఒకవేళ రోజా ఫిర్యాదును జగన్ పట్టించుకోకపోతే మాత్రం.. రోజా తదుపరి ప్రణాళిక ఎలా ఉంటుందనేది కూడా హాట్ టాపిక్‌గా మారింది. మొత్తంగా జగదీష్ చేరికతో వచ్చే ఎన్నికల్లో తనకు రాజకీయంగా ఇబ్బందే అన్న ఆలోచనలో మాజీమంత్రి రోజా ఉన్నట్టు స్పష్టమవుతోంది. చూడాలిమరి చేరికపై పార్టీ హైకమాండ్, రోజా ఎలాంటి సంచనాలతో ముందుకెళ్తారో..!
Also Read: ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
Also Read: Gold Rate Today: అందనంత ఎత్తుకు బంగారం ధరలు.. తులం లక్ష దిశగా పరుగులు.. నేటి ధరలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.