బ్యాంకు ఉద్యోగులని, వారి కుటుంబాలకి చెందిన వారిని పెళ్లి చేసుకోకూడదు అని ఇస్లామిక్ సంస్థ దరుల్ ఉలూమ్ దేవ్‌బంద్ ఓ కొత్త ఫత్వా జారీచేసింది. బ్యాంకు ఉద్యోగంతో నెల జీతం పొందే వారు పాపపు సొమ్ముని సంపాదిస్తున్నట్టే అని దరుల్ ఉలూమ్ దేవ్‌బంద్ అభిప్రాయపడింది. ఆ పాపపు సొమ్ము సంపాదించే వారిని కానీ లేదా పాపపు సొమ్ముని అనుభవించే వారిని కానీ పెళ్లి చేసుకోకుండా ఆధ్యాత్మిక చింతనతో గడిపేవారికే అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా ఈ ఫత్వా స్పష్టంచేసింది.
"తనకి చాలా పెళ్లి సంబంధాలు వస్తున్నాయని.. అందులో కొన్ని కుటుంబాల్లో తండ్రి బ్యాంకు ఉద్యోగం చేసే వారు అయి వుంటున్నారు" అని ఓ సదస్సులో పాల్గొన్న మత పెద్దలకి చెప్పిన ఓ ముస్లిం యువకుడు.. 'హరాం మనీ' (పాపపు సొమ్ము) సంపాదించే ఆ కుటుంబం నుంచి సంబంధం అందుకోవచ్చా అని అడిగారు. ఆ యువకుడి ప్రశ్నకు సదరు మత పెద్ద స్పందిస్తూ.. పాపపు సొమ్ము సంపాదిస్తున్న కుటుంబం నుంచి సంబంధం అందుకోవడం కన్నా అటువంటి సంబంధాలని పక్కకు పెట్టడం ఉత్తమం అని బదులిచ్చారు. పాపపు సొమ్ముని అనుభవించే వారికి నైతిక విలువలు, గౌరవం వుండవు కనుకే వారిని దూరం పెట్టడమే మంచిదని సదరు మత పెద్ద పేర్కొనడం గమనార్హం.
ఇస్లామిక్ చట్టాల ప్రకారం వడ్డీని ఆర్జించడం అనేది ఓ పాపంగా పరిగణించబడుతుంది. బ్యాంకుల్లో చలామణి అయ్యే డబ్బంతా వడ్డీల రూపంలో ఆర్జించేదే కనుక అలా ఆ బ్యాంకులో పనిచేసి తీసుకునే వేతనాన్ని కూడా పాపపు సొమ్ముగానే పరిగణిస్తుంటాయి కొన్ని ఇస్లామిక్ సంస్థలు.