Telangana Politics: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తుంది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి కాంగ్రెస్ సర్కార్ పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ మాత్రం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల నుంచే సీఎం రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ ప్రభుత్వంపై అటాక్ చేస్తూ వస్తుంది. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి మాత్రం ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చేవారు కరువయ్యారు. పేరుకు కాంగ్రెస్ లో ఎంతో మంది పెద్ద లీడర్లు ఉన్నా బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టే పరిస్థితి లేదని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే కాంగ్రెస్ హైకమాండ్ ఈ విషయాన్ని గ్రహించింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్ లో చాలా మంది కొత్త ముఖాలు. మంత్రులుగా కుదురుకోవడానికి కాస్తా సమయం పడుతుందని అధిష్టానం భావించింది. కానీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా మంత్రుల తీరులో మార్పు లేకపోవడంతో హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది.
తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం పాలనా తీరుపై గాంధీ భవన్ లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో ఏఐసీసీ సంస్థాగత ఇంఛార్జ్ కేసీ వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీప్ దాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై పీఏసీలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో గత సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటి..? వాటి పట్ల ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉందని కాంగ్రెస్ పెద్దలు ఆరా తీశారు.ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ విఫలమవుతుందని కాంగ్రెస్ పెద్దలు సమావేశంలో అన్నట్లు చర్చ జరుగుతుంది.
ముఖ్యంగా మంత్రుల తీరుపై కాంగ్రెస్ హైకమాండ్ చాలా సీరియస్ ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణ ఇచ్చిన తర్వాత దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అలాంటి పార్టీనీ బలోపేతం చేసుకోవాల్సిందిపోయి మంత్రులు తమకేమీ పట్టనట్లు ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంత్రి పదువులు పొందిన కొందరు నేతలు కేవలం తమ సొంత వ్యవహారాలే చక్కబెట్టుకుంటున్నారే తప్పా.. పార్టీనీ గాలికి ఒదిలేశారని మంత్రులకు క్లాస్ తీసుకున్నట్లుగా గాంధీ భవన్ లో జోరుగా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్ లో చాలా మంది కొత్తవారు కావడంతో కొద్ది రోజులు వేచి చూశామని ఇక నుంచి అలా కుదరదు అని అధిష్టానం ఒకింత సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. పార్టీ కోసం పనిచేసే వారికి మంత్రి పదవులు ఉంటాయని స్పష్టం చేసింది.
ఒక పక్క ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దిగుతుంటే మంత్రులు మాత్రం మౌనంగా ఉండడం ఏంటని నేతనలు ప్రశ్నించింది. పార్టీకీ వ్యక్తులు ముఖ్యం కాదనీ పార్టీ కోసం పనిచేసే వారే మాత్రమే గుర్తింపు ఉంటుందని కాంగ్రెస్ పెద్దలు పార్టీ నేతలకు చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇక నుంచి మంత్రులుగా పార్టీ కోసం మరింత ఆక్టివ్ గా పనిచేయాలని అల్టిమేటమ్ జారీ చేసింది. అంతే కాదు మంత్రులు తమ తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవంటూ ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమైన కేసీ వేణుగోపాల్ ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఇక నుంచి మంత్రులు ప్రభుత్వం నిర్ణయాలను ప్రజల్లోకి మరింత ఆక్టివ్ గా తీసుకెళ్లడంతో పాటు ప్రతిపక్షాల విమర్శలకు ధీటు సమాధానమివ్వాలని ఆదేశించింది.మీరు మౌనంగా ఉంటే ప్రజల్లోకి మరోరకంగా సంకేతాలు వెళుతాయని మంత్రులతో వేణుగోపాల్ అన్నట్లుగా తెలుస్తుంది.
ఇది ఇలా ఉంటే కేసీ వేణుగోపాల్ తో సమావేశం తర్వాత బయటకు వచ్చిన మంత్రులు చాలా డీలా పడిపోయారట.అసలు కేసీ వేణుగోపాల్ ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారా అని ఒకరితో ఒకరు చర్చించుకున్నారట. కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే త్వరలో ఎవరికో మంత్రిపదవికి గండం పొంచి ఉందని నేతలు చర్చించుకున్నారట. పైకి ఎవరికి వారు తాము కాదని గంభీరంగా ఉన్నా లోలోన మాత్రం కొందరు మంత్రులు ఆందోళన చెందుతున్నారట. మరోవైపు కేసీ వేణుగోపాల్ కామెంట్స్ బట్టి చూస్తుంటే త్వరలో కొందరికి మంత్రి పదవుల నుంచి ఉద్వాసన తప్పదని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారట.
ఇదే సమయంల మరి కొందరు నేతలు మాత్రం కేసీ వేణుగోపాల్ కామెంట్స్ పై తెగ సంబరపడిపోతున్నారట. ఒక వేళ మంత్రివర్గం నుంచి ఎవరినైనా తప్పిస్తే ఆ అవకాశం తమకు దక్కవచ్చని అని తెగ ఆశపడుతున్నారట. మంత్రివర్గంలో స్థానం కోసం ఇప్పటి నుంచే ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అటు అధిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో కొందరు నేతలు ఉన్నారట. ఇలా పీఏసీ సమావేశం తర్వాత కాంగ్రెస్ లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి.మంత్రి పదవులు ఊడుతాయని కొందరు ఆందోళన చెందుతుంటే తమకు మంత్రి పదవులు దక్కవచ్చని మరి కొందరు నేతలు ఆనందపడుతున్నారట. మొత్తానికి పీఏసీ సమావేశం కొందరి నేతల్లో సంతోషం నింపితే మరి కొందరు నేతల్లో మాత్రం టెన్షన్ ను పెంచుతున్నాయి.
Also Read: EPFO: పెన్షన్ దారులకు గుడ్‌న్యూస్..ఇక నుంచి దేశంలో ఎక్కడైనా, ఏ బ్యాంకు నుంచైనా పింఛన్ తీసుకోవచ్చు.
Also Read: Gold Rate Today: కొత్త సంవత్సరం వేళ..తగ్గిన బంగారం ధర..ఎంత తగ్గిందో తెలిస్తే కొనేస్తారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి