ప్రత్యేక హోదా కోసం.. రహదారుల దిగ్భంధం..!

ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ‘ప్రత్యేక హోదా సాధన సమితి’ గురువారం రహదారుల దిగ్భందానికి పిలుపునిచ్చింది

Last Updated : Mar 22, 2018, 02:42 PM IST
ప్రత్యేక హోదా కోసం.. రహదారుల దిగ్భంధం..!

ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ‘ప్రత్యేక హోదా సాధన సమితి’ గురువారం రహదారుల దిగ్భందానికి పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఈ నిరసన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. విశాఖలో జరిగిన నిరసన కార్యక్రమంలో భాగంగా నిరసనకారులు రాస్తారోకోని నిర్వహించారు. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే శ్రీకాకుళం  జిల్లా ఇచ్ఛాపురంలో నిరసన కార్యక్రమాలు చేపట్టిన  ‘ప్రత్యేక హోదా సాధన సమితి’ కార్యకర్తలు, 16వ నెంబరు జాతీయ రహదారి వద్ద వాహనాలను అడ్డుకున్నారు.  అనంతపురం-బెంగళూరు జాతీయ రహదారిని కూడా దిగ్భందం చేస్తూ.. ఆ ప్రాంత ప్రజలు వాహనాలను నిలిపివేశారు

కృష్ణాజిల్లా నందిగామలో కూడా ప్రత్యేక హోదాని డిమాండ్ చేస్తూ..కార్యకర్తలు విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారి వద్ద వాహనాలను అడ్డుకున్నారు. చెన్నై-కలకత్తా జాతీయ రహదారిపై రామవరప్పాడు వద్ద తెలుగుదేశం నాయకుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీ నేత కళా వెంకటరావు తన పార్టీ నేతలతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైఎస్సాఆర్‌సీపీ పార్టీ కార్యకర్తలతో కలిసి ధర్నా్ల్లో పాల్గొనవద్దని ఆయన కోరారు. తొలుత తెలుగుదేశం పార్టీ తాము అధికారంలో ఉన్నందున ధర్నా్లో పాల్గొనలేమని, కాకపోతే మద్దతు ఇస్తామని తెలిపింది. అయితే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా స్వచ్ఛందంగా ఈ దిగ్భంధ కార్యక్రమాల్లో పాల్గొనడం గమనార్హం. 

Trending News