తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్‌కి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ధన్యవాదాలు తెలియజేశారు. హరితహారం ఛాలెంజ్‌లో భాగంగా తనను మొక్కలు నాటమని కోరిన కేటీఆర్ విన్నపానికి ఆయన స్పందించారు. తన ఇంటి వద్ద మొక్కలు నాటుతున్న ఫోటోలను పోస్టు చేసి.. తనకు ఛాలెంజ్ విసిరిన కేటీఆర్‌కి ఆయన థ్యాంక్స్ తెలిపారు.
"గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా నన్ను ఎంపిక చేసిన కేటీఆర్‌కు నా ధన్యవాదాలు. ఈ ఛాలెంజ్ స్వీకరించిన నేను మొక్కలను నాటాను. అందరూ ఇదే ఛాలెంజ్ స్వీకరించి.. మీ మీ ఇండ్లలో మొక్కలు నాటాలని కోరుతున్నాను. భూమాత పచ్చగా ఉండేలా చేయడం మన అభిమతం కావాలి" అని సచిన్ టెండుల్కర్ ట్వీట్ చేశారు. సచిన్ సమాధానానికి కేటీఆర్ కూడా స్పందించారు. "ధన్యవాదాలు మాస్టర్... మీరు ఈ ఛాలెంజ్‌కి మరో అయిదుగురిని ఎంపిక చేస్తే బాగుంటుంది" అని కేటీఆర్ సచిన్ ట్వీట్‌కి సమాధానం ఇచ్చారు. కేటీఆర్ ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన మరో క్రికెట్ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్‌కి కూడా ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణలో హరితాహారం అనేది ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రం మొత్తం మొక్కలను నాటి, పచ్చదనానికి పెద్దపీట వేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. 2016లోనే ఈ కార్యక్రమంలో భాగంగా 46 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే హైదరాబాద్ నగరంలో ఒక్కరోజులో 25 లక్షల మొక్కలు నాటి రికార్డు సృష్టించడం జరిగింది. అలాగే ప్రతీ రెండు గ్రామాలకు ఒక నర్సరీ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,213 నర్సరీలు ఏర్పాటుచేశారు.
Thank you, @KTRTRS, for nominating me for the green challenge #HarithaHaram. I accept the challenge and hope all of you do too. The key to a greener planet is in our hands. pic.twitter.com/vMzifaGjlm
— Sachin Tendulkar (@sachin_rt) July 28, 2018