కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 84వ పార్టీ ప్లీనరీ సమావేశంలో వివిధ అంశాలపై ప్రసంగించారు. అందులోని ముఖ్యంశాలు ఇవే
*కొన్ని యుగాల క్రితం కౌరవులకు, పాండవులకు మధ్య యుద్ధం జరిగింది. కౌరవులు అధికార దాహంతో, గర్వంతో విర్రవీగేవారు. కానీ పాండవులు హుందాగా వ్యవహరిస్తూ.. సత్యం పక్కన నిలచారు. ఇప్పుడు కూడా బీజేపీ ఆరెస్సెస్ సహాయంతో కౌరవుల్లా వ్యవహరిస్తుంటే.. కాంగ్రెస్ పాండవులను ఆదర్శంగా తీసుకుంటోంది.
*ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజల ధ్యాసను పక్కన పెట్టాలని చూస్తున్నారు. ఒక్కసారి ఆ గబ్బర్ సింగ్ ట్యాక్స్ గురించి మాట్లాడతారు. మరోసారి యోగా గురించి మాట్లాడతారు. కానీ సమస్యలపై ఎప్పుడూ మాట్లాడరు. సమస్యలను ఆయన జనుల ఊహలుగా భావిస్తారు. కానీ కాంగ్రెస్ నిజాలను మాట్లాడడం మాత్రం మరువలేదు
*బీజేపీ ప్రజల్లో భయాన్ని పెంపొందిస్తోంది. ఇప్పటికే నలుగురు సుప్రీం కోర్టు జడ్జిలు తమకు న్యాయం చేయమని ప్రజల దగ్గరకు పరుగెత్తుకొని వచ్చారు. మేము అన్ని సంఘాలనూ గౌరవిస్తాం. కానీ బీజేపీకి కావాల్సింది ఒకటే సంఘం. అదే ఆరెస్సెస్
*రాఫెల్ డీల్లో మోదీగారు ఏం చేశారో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. మేము అప్పట్లో ఒక్కో విమానాన్ని రూ.570 కోట్ల రూపాయలకు కొనడానికి డీల్ చేస్తే.. ఆయన రూ.1670 కోట్ల రూపాయలకు అదే డీల్ చేశారు. డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో ఆయనకు తెలియడం లేదు. అలాంటి వ్యక్తిని కనీసం కూరగాయలు కొనడానికి కూడా పంపకూడదు. మోదీ గారే అవినీతిని అంతమొందిస్తానని అన్నారు. కానీ ఆయన అవినీతిమయం అయ్యారు
*బీజేపీ హయాంలో ఎవరో వ్యాపారవేత్త రూ 33,000 కోట్ల రూపాయలను బ్యాంకుల నుండి కొల్లగొట్టాడు. అయినా మేం మాట్లాడకూడదంటే ఎలా..? ఈ విషయంలో ఆర్థికమంత్రి కూడా ఏమీ అనడం లేదు. ఎందుకంటే ఆయన కూతురు కూడా క్యాప్టిలిస్టులతో కలిసి పనిచేస్తోంది
*గౌరీ లంకేష్తో పాటు కల్బుర్గికి ప్రభుత్వం ఒకటే చెప్పింది. మమ్మల్ని ప్రశ్నించండి.. మీ చావును కొనితెచ్చుకోండి అని
*దేశంలో రైతులందరూ చనిపోతున్నారు. దానికి ఒకటే మాట చెబుతుంది ప్రభుత్వం.. "రండి.. యోగా చేద్దాం" అని
*ప్రస్తుతం కొందరు నాయకులు ముస్లిములను పాకిస్తాన్తో సంబంధం లేకున్నా దేశాన్ని విడిచి వెళ్లిపోమంటున్నారు. అలాగే తమిళులను వారి అందమైన భాషను మార్చుకోమంటున్నారు. ఈశాన్య ప్రజల తిండి పై కామెంట్ చేస్తున్నారు. ఇంకా మహిళలు ఏవి ధరించాలో .. ఏవి ధరించకూడదో చెబుతున్నారు
*మేము మమ్మల్ని సమర్థించుకోవడం లేదు. పూర్వపు ప్రభుత్వంలో మేము ప్రజల ఆకాంక్షలకు తగ్గే విధంగా నడుచుకోవడంలో కొంత విఫలమయ్యాం. తప్పులు అందరి వల్లా జరుగుతాయి.. మనం మనుషులం.. తప్పులు చేస్తాం.. కానీ మోదీ గారు తనని తాను మనిషి అనుకోవడం లేదు.. భగవంతుని స్వరూపంగా భావిస్తున్నారు
*నేను కాంగ్రెస్ను పునర్వ్వవస్థీకరించాలని భావిస్తున్నాను. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మధ్య ఓ గట్టి గోడ ఉంది. అవే గోడలను ప్రేమగా కూల్చడంలో నేను సీనియర్ల సహాయం తీసుకుంటాను. మన మధ్య ఉన్న భేదాభిప్రాయలను తొలిగించడమే నా లక్ష్యం