అమరావతి: స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామా రావు భవిష్యత్ తరాలకు ఓ స్ఫూర్తి ప్రదాత అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నేడు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఉదయం టీడీపీ నేతలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. ముందుగా ఎన్టీఆర్కి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతూ.. ''ఎన్టీఆర్ వర్థంతిని ఒక సంకల్పదినంగా భావించాల్సి ఉంటుంది'' అని అన్నారు. సమాజ సేవలో చురుకుగా పాల్గొని పేదల అభ్యున్నతికి పునరంకితం కావాలని పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. పేదల కోసం అనుక్షణం తపించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్. పేదల కష్టాలను తీర్చి, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లినరోజే పేదరికంపై గెలుపు సాధిస్తామని, అదే ఆ మహానుభావుడికి నిజమైన నివాళి అవుతుంది అని అన్నారు.
పేదలకు మేలు చేసే సంక్షేమ పథకాలకు ఎన్టీఆరే ఆద్యుడు అని చెబుతూ... అందుకే పేదల కడుపు నింపే సామాజిక పెన్షన్లను 10 రెట్లు పెంచామని చంద్రబాబు తెలిపారు. పేదల సంక్షేమం కోసం నేరుగా లబ్ధిదారులకే నగదు బదిలీ, విద్య, వైద్యం, ఆహారభద్రత కల్పించే విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పిన చంద్రబాబు... మున్ముందు ప్రతీ కుటుంబానికి నెలకు కనీసం రూ.10వేల ఆదాయం వచ్చేలా సంక్షేమ పథకాలు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రజల ఆదాయం పెరిగి, జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చేయడమే ప్రభుత్వం లక్ష్యం అని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.