Kishan Reddy warns Telangana CM KCR: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వస్తుంటే.. ఈ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు తీరికలేని దరిద్రపు ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరమా? అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ప్రశ్నించారు. చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు.. బీఆర్ఎస్ పార్టీ, కల్వకుంట్ల కుటుంబ సభ్యులు చేస్తున్న నాటకాలను గమనిస్తున్నారని.. దీనికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సరైన సమాధానం చెబుతారని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని పాలించడం చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలని, అంతే తప్ప అర్థంలేని విమర్శలు చేయొద్దని కిషన్ రెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని.. 90 రోజుల తర్వాత కల్వకుంట్ల కుటుంబం ఫాంహౌజ్ కు పరిమితం కావడం ఖాయమన్నారు.
శనివారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో.. మాజీ మంత్రులు కృష్ణ యాదవ్ గారు, చిత్తరాంజన్ దాస్, సిర్పూర్ జడ్పీటీసీ రేఖ సత్యనారాయణ, బండల రామచంద్ర రెడ్డితో పాటు పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు బీజేపీలో చేరగా కేంద్రమంత్రి వారికి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్ కుటుంబంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంపై, కల్వకుంట్ల కుటుంబంపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి సానుకూల వాతావరణం ఉంది. అనేక సర్వేల్లో బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటమి పాలవ్వడం ఖాయమని చెప్తున్నాయి. ఓటమి భయంతో కేసీఆర్ బిజెపిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబం గౌరవ ప్రధానిపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు అని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
ఫామ్ హౌజ్‌లో రాజకీయం చేసే వ్యక్తి కేసీఆర్. దేశంలో మౌలిక వసతులు కల్పించేందుకు, అభివృద్ధి కోసం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేసే వ్యక్తి నరేంద్ర మోదీ రాష్ట్రాభివృద్ధి కోసం స్వయంగా తెలంగాణకు వస్తుంటే.. వేలకోట్లు దోపిడీ చేసిన కేసీఆర్ కుటుంబం గౌరవ ప్రధానిని విమర్శించడం సిగ్గుచేటు అని కిషన్ రెడ్డి అసహనం వ్యక్తంచేశారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, భూమిపూజ చేసేందుకు ప్రధాని మోదీ తెలంగాణకు వస్తుంటే.. ఆ కార్యక్రమాల్లో పాల్గొనకుండా కుట్రలు చేసే ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ తెలంగాణకు అవసరం లేదు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో వేల కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
కిషన్ రెడ్డి ప్రసంగం నుండి పలు ముఖ్యాంశాలు
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి, వందేభారత్ ట్రైన్లు, కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీతో పాటు వివిధ ప్రాజెక్టులను స్వయంగా ప్రధాని మోదీ ప్రారంభించారు.
- కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో రూ. 9 లక్షల కోట్లు తెలంగాణ అభివృద్ధి కోసం ఖర్చుపెట్టింది.
- కేసీఆర్ కు కౌంట్ డౌన్ మొదలైంది.. ప్రగతి భవన్ లో ఉండేది 90 రోజులే.. ఆ తర్వాత శాశ్వతంగా ఫామ్ హౌస్ లోనే ఉండబోతున్నారు.
- ప్రగతి భవన్ .. కేసీఆర్ కుటుంబ ప్రగతి భవన్ తప్ప తెలంగాణ ప్రజలది కాదు.
- కేసీఆర్ కుటుంబం వేలకోట్ల రూపాయల దోపిడీ చేశారు. అందుకే అడుగడుగునా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నిలదీస్తున్నారు.
- కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో... ఇది తెలంగాణ ప్రజల నినాదం.
- అవినీతి, అహంకారానికి, నియంతృత్వ పోకడలకు, విపక్షాల నిర్భంధాలకు, అరాచక పాలనకు, ప్రజాస్వామ్య అణచివేతకు, అసమర్థ విధానాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది.
- బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో నిధుల కొరతతో విద్యావ్యవస్థ నీరుగారింది. నిర్లక్ష్యంతో పేదల సంక్షేమం ప్రచారానికే పరిమితమైంది.
- దళితబంధు అమలు కాలేదు.. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలే.. యువతకు ఉద్యోగాలు రాలేదు, నిరుద్యోగ భృతి అందలేదు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ జరగలే.
- ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేయడం లేదు. దవాఖాన్లలో ఆరోగ్య శ్రీ అమలు చేయడం లేదు.
- రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ దివాళా తీసింది. ఉద్యోగులకు జీతాలియ్యలేని పరిస్థితి నెలకొంది.
- నరేంద్ర మోదీ సుపరిపాలనతో ప్రపంచంలోనే అతిపెద్ధ ఆర్థిక శక్తిగా భారత్ ఐదో స్థానానికి ఎగబాకింది.
- కేసీఆర్ పాలనలో అవినీతి తప్ప.. అభివృద్ధి కాలేదు. కేసీఆర్ కుటుంబం బంగారు కుంటుంబంగా మారింది తప్ప.. బంగారు తెలంగాణ కాలేదు.
- కాంగ్రెస్ కు ఓటేస్తే.. బీఆర్ఎస్ పార్టీకి వేసినట్లే. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే.. ఆ పార్టీ నుంచి గెలిచినోళ్లు కేసీఆర్ కుటుంబానికి అమ్ముడుపోయి బీఆర్ఎస్ లో చేరుతారు.
- కాంగ్రెస్ .. 6 గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మభ్యపెడుతోంది. వాళ్లు 60 గ్యారెంటీలు ఇచ్చినా తెలంగాణ సమాజం నమ్మదు.
- కర్ణాటకలోనూ గ్యారెంటీల పేరుతో నమ్మించి భస్మాసుర హస్తంగా కుచ్చుటోపీ పెట్టింది.
- దేశాన్ని 60 ఏండ్లు పాలించి దోపిడీ చేసి గ్రామీణ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణను ఏరకంగా దోచుకోవాలనేదే కాంగ్రెస్ పార్టీ ఆలోచన.
- ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబరు 1న మహబూబ్ నగర్, 3న ఇందూరుకు విచ్చేస్తున్నారు.
- సుమారు రూ. 20 వేల కోట్ల పైచిలుకు అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ ప్రజలకు అంకితం చేయనున్నారు.
- అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ముఖ్యమైన సమస్యలను పరిష్కరించేలా పాలమూరు, ఇందూరు ప్రజలకు వరాలు ప్రకటించనున్నారు.
- అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతోంది.
- అక్టోబరు 1వ తేదీ ఉ. 9 గం.ల నుంచి 10 గం.ల వరకు దేశంలోని ప్రతి జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాలు, ప్రతి కాలనీ, బస్తీలోని ప్రజలంతా స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నా.
- దేశ వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉద్యమంగా మారింది.
- ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా పాలమూరు ప్రజాగర్జన సభ, ఇందూరు ప్రజాగర్జన సభలను విజయవంతం చేయాలని కోరుతున్నా.