Harish Rao vs Revanth Reddy: పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో రేవంత్ రెడ్డి తీరుతో శాంతిభద్రతలు కనుమరుగయ్యాయని.. రాష్ట్రంలో క్రైమ్ రేట్ భారీగా పెరిగిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలని సంచలన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గూండాలు బీఆర్‌ఎస్ పార్టీ, బీజేపీ కార్యాలయంపై దాడులు చేస్తున్నా రేవంత్ రెడ్డి స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. తక్షణమే కేంద్ర హోం శాఖ స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: K Kavitha: రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్‌లోనే.. కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కార్యాలయాలతోపాటు ఎమ్మెల్యేలపై దాడుల సంస్కృతి మారకుంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో మత కలహాలు పెరిగాయని.. రాష్ట్రంలో 23 శాతం క్రైం రెట్ పెరిగిందని వివరించారు. హింసా రాజకీయాలపై కేంద్ర హోంశాఖ సమీక్ష చేయాలని కోరారు. రేవంత్ రెడ్డి నుంచి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకుందా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి హామీల అమలుపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
Also Read: Danam Nagender: రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు.. తిరుగుబాటు మొదలైందా?
సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవాం మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తీరుపై.. కాంగ్రెస్ వైఫల్యాలపై మరోసారి నిలదీశారు. ఇదే క్రమంలో కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిని ఎమ్మెల్యే హరీశ్ రావు ఖండించారు. కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిలదీస్తే ఇలా పార్టీ కార్యాలయాలపై.. ఎమ్మెల్యేలపై దాడులు చేస్తున్నారని వివరించారు.
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నట్టేట ముంచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులను గ్రామాల్లో రైతులతోపాటు ప్రజలు నిలదీయాలని మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లోకి వస్తే ఎకరాకు రూ.15 వేలు రైతుబంధు ఇవ్వాల్సిందేనని నిలదీయాలని సూచించారు. రేవంత్ రెడ్డి ఒక్క పంటకు కూడా రైతుబంధు సరిగా ఇవ్వడం లేదని.. కౌలు రైతులకు ఇవ్వడం లేదని గుర్తుచేశారు.
కనపడ్డ దేవుళ్లందరి మీద ఒట్టు పెట్టి రైతు రుణమాఫీ అన్నాడు.. ఏడాది గడిచినా ఇంతవరకు రుణమాఫీ కాలేదని మాజీ మంత్రి హరీశ్ రావు వివరించారు. రేవంత్ రెడ్డి బుకాయింపులు మాని ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గుండాలతో కొట్టించుడో.. చిల్లరగాళ్లతో తిట్టించుడు మానండని హితవు పలికారు. అసెంబ్లీలో చెప్పిన మాటలు కూడా తప్పుతుండడం దారుణంగా పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా రైతులు తిడుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు రేవంత్ రెడ్డి హింసా రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. ప్రజలు తమను ప్రశ్నించకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. సంక్షేమంలో విఫలమైన రేవంత్ రెడ్డి హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. హోంమంత్రి, ముఖ్యమంత్రిగా ఉండి రేవంత్ రెడ్డి హింసాత్మక సంఘటనలను ప్రోత్సహిస్తే పెట్టుబడులు వస్తాయా? అని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అల్లు అర్జున్ ఇళ్ల మీద దాడులు, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కార్యాలయాలపైన కాంగ్రెస్ గూండాలు దాడులు చేయడం చాలా తప్పని మాజీమంత్రి హరీశ్ రావు ఖండించారు. రాజకీయ ప్రయోజనాలే రేవంత్ రెడ్డికి ముఖ్యమయ్యాయని.. రాష్ట్రాన్ని రావణకష్టంగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.