Exclusive Interview: 40 ఏళ్ళు వచ్చినా.. రంజీలో తిరుగులేని క్రికెట్ మొనగాడు..!

దేశవాళీ క్రికెట్‌లో పేరెన్నికగల ఆటగాడు వసీం జాఫర్. ఇప్పటికి రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా ఆయన సుపరిచితుడు.

Last Updated : Apr 24, 2018, 05:19 PM IST
Exclusive Interview: 40 ఏళ్ళు వచ్చినా.. రంజీలో తిరుగులేని క్రికెట్ మొనగాడు..!

దేశవాళీ క్రికెట్‌లో పేరెన్నికగల ఆటగాడు వసీం జాఫర్. ఇప్పటికి రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా ఆయన సుపరిచితుడు. తొలుత ముంబయికి ఆడిన ఈ క్రికెటర్.. ఆ తర్వాత విదర్భ తరఫున ఆడడం మొదలుపెట్టాడు. 2018లో విదర్భ రంజీ ట్రోఫీ గెలవడం వెనుక వసీం జాఫర్ ప్రధాన పాత్ర పోషించాడు. ఆఖరి మ్యాచ్‌లో ఆఖరి బాల్‌కి బౌండరీ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చిన ఘనత ఆయనది.

విదర్భ తరఫున ఇరానీ కప్‌లో ఆడిన మ్యాచ్‌లో 286 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు జాఫర్. అందులో 34 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. దేశీ క్రికెట్‌‌కి "సచిన్ టెండుల్కర్"గా జాఫర్‌ని ఆయన అభిమానులు పిలుచుకుంటారు. సాధారణంగా 35 ఏళ్ళకే క్రికెటర్లు అందరూ రిటైరైపోతున్నా.. 40 ఏళ్ళు వచ్చినా.. తన ప్రతిభతో దేశీవాళీ క్రికెట్‌కి ఒక బ్రాండ్‌గా వెలుగుతున్న ధీరుడు వసీం జాఫర్. 

ఫిబ్రవరి 16, 1978 తేదిన జన్మించిన వసీం జాఫర్‌ని ఇటీవలే జీ న్యూస్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

ఫిట్‌నెస్ చాలా ముఖ్యం
ముఖ్యంగా 40 సంవత్సరాల వయసులో కూడా డబుల్ సెంచరీ చేసి.. క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన జాఫర్.. దానికి ముఖ్యమైన కారణం ఫిట్‌నెస్ అని తెలిపారు. ఫిట్‌నెస్ ఏ ఆటగాడికైనా ముఖ్యం అని.. అది లేనప్పుడు వారు క్రీడల్లో సరిగ్గా రాణించలేరని అన్నారు. కాకపోతే పూర్తిగా ఫిట్‌నెస్ పైనే ఆధారపడలేమని ఆయన స్పష్టం చేశారు.

దేశవాళీ క్రికెట్‌లోకి అడుగుపెట్టాక... తాను ఆడిన రెండవ మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన జాఫర్,తాను కూడా పూర్తిగా ఫిట్ అని చెప్పనని.. అయితే సాధ్యమైనంత వరకు ఫిట్‌గా ఉండడానికి ప్రయత్నిస్తానని చెప్పడం గమనార్హం. ఫిట్‌నెస్‌తో నైపుణ్యాన్ని పెంచుకోగలిగినప్పుడే ఎవరైనా రాణించగలరని ఆయన పేర్కొన్నారు. నైపుణ్యాలు పెంచుకోలేకపోతే ఫిట్‌గా ఉన్నా ఫలితాలు రావని.. అలా ఫలితాలు రానప్పుడు గేమ్ కూడా మరుగునపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎంజాయ్ చేసి ఆడాలి..
ఈ రోజు క్రికెట్ రంగంలో కూడా విపరీతంగా పోటీ పెరిగిందని జాఫర్ తెలిపారు. అలాగే తాను 40 ఏళ్ళ వయసులో డబుల్ సెంచరీ చేయడం పట్ల కూడా ఆయన స్పందించారు. తాను ఆటను ఆస్వాదించి ఆడతానని.. ఎవరైనా గేమ్‌ను ఎంజాయ్ చేసి ఆడితేనే అందులో మంచి ఫలితాలు సాధించగలరని ఆయన చెప్పారు. అందుకే రిటైర్‌మెంట్ విషయం గురించి తాను మాట్లాడనని.. తన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ఆడడానికి ప్రయత్నిస్తానని.. రాణించడానికి ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. 

యువకులతో ఆడడం ఇష్టం
నేడు క్రికెట్‌లో యువకులు బాగా రాణిస్తున్నారని.. వారితో కలిసి ఆడడం తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు జాఫర్. ఇటీవలే విదర్భ రంజీ మ్యాచ్‌ను గెలవడంలో యువ ప్రతిభావంతుల పాత్ర ఎంతో ఉందని ఆయన చెప్పారు. అలాగే ఇండియా-ఏ జట్టులో ఆటగాళ్లు కూడా చాలా అద్భుతంగా ఆడుతున్నారని.. భారతదేశానికి సంబంధించి భావి క్రికెట్ జట్లలో వారిని తప్పకుండా చూడవచ్చని ఆయన చెప్పారు.

అలాగే ప్రస్తుత టీమిండియా జట్టు మీద కూడా తన అభిప్రాయాలు పంచుకున్నారు జాఫర్. విరాట్ కోహ్లీ నాయకత్వంలో జట్టు బాగా ముందుకు పోతుంది అన్నారు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం పూర్తిగా వేరే లెవల్ క్రికెట్ ఆడుతున్నాడని.. టీమ్ కూడా చాలా పకడ్బందీ ప్లాన్‌తో ముందుకు వెళ్తుందని ఆయన తెలిపారు. అలాగే విదేశీ క్రికెటర్లలో తనకు నచ్చిన వారి గురించి ప్రస్తావిస్తూ.. తనకు ఇంగ్లండ్ ఆటగాడు జోరూట్ బ్యాటింగ్ అంటే చాలా ఇష్టమని తెలిపారు

సచిన్ టెండుల్కరే నాకు ఆదర్శం
తాను క్రికెట్ కెరీర్‌లోకి అడుగుపెట్టేటప్పటికే సచిన్ టెండుల్కర్ చాలా పెద్ద స్టార్ అని జాఫర్ తెలిపారు. సచిన్ గేమ్ చూసి తాను చాలా నేర్చుకున్నానని.. అతనితో కలిసి ఆడే అవకాశం రావడం తన లక్ అని పేర్కొన్నారు. తన తరం వారికి సచిన్ పెద్ద రోల్ మోడల్ అని.. ఆయనతో కలిసి డ్రస్సింగ్ రూమ్ పంచుకోవడం ఓ గొప్ప అనుభూతి ఆని ఆయన తెలియజేశారు

ఐపీఎల్ ఆడడం వేరు... టీమిండియాకి ఆడడం వేరు
ఐపీఎల్ మ్యాచ్‌ల పై కూడా జాఫర్ తన అభిప్రాయాలు పంచుకున్నారు. గ్లామర్ చూసి ఎవరూ గేమ్ ఆడకూడదని ఆయన అన్నారు. యువ క్రీడాకారులు కొన్నాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడాక...ఐపీఎల్‌లో ఎన్ని డబ్బులు వచ్చే అవకాశం ఉంది అని ఆలోచించకూడదు.. అంతకన్నా టీమిండియాలో చోటు ఎలా దక్కించుకోవాలో ఆలోచించాలి. అందుకు చాలా కష్టపడాలి కూడా అని అన్నారు. 

Trending News