హైదరాబాద్: ఎంఐఎం శాసనసభా పక్ష నేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్ర కడుపు నొప్పితో శనివారం ఆస్పత్రిలో చేరారు. కడుపునొప్పితో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు కంచన్‌బాగ్‌లోని ఓవైసీ ఆసుపత్రిలో చేర్పించినట్టు తెలుస్తోంది. ఓ విందుకు హాజరైన అక్బరుద్దీన్‌కు అక్కడే తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో వెంటనే ఆయనను ఓవైసీ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో వున్న అక్బరుద్దీన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే వుందని ఆస్పత్రివర్గాల ద్వారా తెలుస్తోంది.
అక్బరుద్దీన్ సోదరుడు, ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆసుపత్రికి వచ్చి పరామర్శించి వెళ్లారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో ఓ ఎన్నికల ర్యాలీలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. గత కొన్నాళ్లుగా తన ఆరోగ్యం బాగుండటంలేదని చెప్పిన సంగతి తెలిసిందే. అక్బరుద్దీన్ చేసిన ఈ ప్రకటన పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేయగా తాజాగా ఆయన ఇలా ఉన్నట్టుండి ఆస్పత్రిపాలవడం వారిని మరింత కలవరపాటుకు గురిచేస్తోంది.
అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన అక్బరుద్దీన్ ఓవైసీ