Harish Rao on Congress Guarantees: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అలవికాని హామీలు, అబద్ధాల ఆరోపణలు అంటూ మండిపడ్డారు. చరిత్ర వక్రీకరించారని.. కాంగ్రెస్ సభ సాంతం ఆత్మవంచన.. పరనిందగా సాగిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారంటీలు దేవుడెరుగు.. అసలు ఆ పార్టీకి ఓట్లు పడతాయనే గ్యారంటీనే లేదంటూ ఎద్దేవా చేశారు. గాలికి పోయే పేల పిండి కృష్ణార్పణం అన్నట్లుంది కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభలో ఇచ్చిన హామీలంటూ కౌంటర్ ఇచ్చారు. నెత్తి నాది కాదు.. కత్తి నాది కాదు.. అధికారంలోకి వచ్చేది ఉందా..? ఇచ్చేది ఉందా..? అనుకుంటూ బూటకపు హామీలు ఇస్తున్నారంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన గ్యారంటీలు కూడా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల్లో నుంచి కాపీ కొట్టినవేనని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది వారెంటీలు లేని గ్యారెంటీలు అని అన్నారు హరీశ్ రావు. కర్నాటకలో ఇలానే ఇష్టానుసారం హామీలను ఇచ్చి.. ఇప్పుడు వాటిని అమలు చేయలేక వంద రోజుల్లోనే ఆగం ఆగం అవుతున్నారని విమర్శించారు. ఆ రాష్ట్రంలో కరెంటు లేదని రైతులు.. పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఛార్జీలు పెంచి అక్కడి ప్రజల నడ్డి విరిచారని మండిపడ్డారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారా..? అని ప్రశ్నించారు. ఏరుదాటక తెప్ప తగలబెట్టేరకం మీరంటూ ఫైర్ అయ్యారు.
మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు దేశవ్యాప్తంగా రైతుబంధు, రైతు బీమా, దళితబంధు పథకాలు ఇస్తారా..? అని మంత్రి అడిగారు. ఎన్నికలు రాగానే ఇక్కడి రావడం.. నోటికి వచ్చింది చెప్పడమే తప్ప.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారంటీలను అమలు చేసేది ఎవరు..? అని ప్రశ్నించారు. 2014లో కాంగ్రెస్ ఇలానే భూటకపు హామీలు ఇచ్చిందని.. అప్పుడు 44 ఎంపీ సీట్లు వచ్చాయని.. ఇక 2019లో 52 వచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణ ఎవరి దయతోనూ రాలేదని.. ప్రజలు పోరాడి గెలుచుకున్నారని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ దయతో ఇచ్చి ఉంటే వందలాది మంది యువకులు ఎందుకు బలిదానం చేసుకున్నారని అడిగారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో తాము బీజేపీకి మద్దతు ఇవ్వలేదని.. రాహుల్ గాంధీ అజ్ఞానానికి జోహార్లు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి యశ్వంత్ సిన్హాను పిలిచి భారీ సభ పెట్టామని.. కాంగ్రెస్ పార్టీ నేతలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ హయాంలోనే జీఎస్టీ బిల్లును తీసుకువచ్చారని.. ఇప్పుడు జీఎస్టీ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం లేదా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో వేల కుంభకోణాలు జరిగాయని హరీశ్ రావు ఆరోపించారు.
Also Read: Ghaziabad Man Death: షాకింగ్ ఘటన.. ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేస్తూ యువకుడు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook