రాజకీయాలను వదిలిపెడతాను.. గ్రామీణ ప్రజలకు సేవ చేస్తాను: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు హైదరాబాద్ హైటెక్స్ సైబర్ కన్వెన్షన్‌లో జరిగిన "ఆత్మీయ సమావేశం" కార్యక్రమంలో తన మదిలోని మాటలను పంచుకున్నారు.

Last Updated : Aug 28, 2018, 10:51 PM IST
రాజకీయాలను వదిలిపెడతాను.. గ్రామీణ ప్రజలకు సేవ చేస్తాను: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు హైదరాబాద్ హైటెక్స్ సైబర్ కన్వెన్షన్‌లో జరిగిన "ఆత్మీయ సమావేశం" కార్యక్రమంలో తన మదిలోని మాటలను పంచుకున్నారు. తాను ఈ రోజు ఈ స్థాయికి రావడం వెనుక తన స్నేహితుల ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. తనకు గ్రామాలంటే ఎంతో ఇష్టమని.. గ్రామీణులకు సేవ చేయడం కోసం తాను రాజకీయాలకు స్వస్తి పలుకుతానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చిన్ననాటి జ్ఞాపకాలను.. ఆ తర్వాత తాను రాజకీయ నాయకుడిగా ఎదిగిన క్రమం గురించి గుర్తుచేసుకున్నారు. ప్రతీ ఒక్కరూ తమ సంస్కృతిని, మాతృభాషను మర్చిపోకూడదని.. అలాగే రైతులే దేశానికి వెన్నెముక అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని.. వ్యవసాయ రంగాన్ని రక్షించేందుకు కృషి చేయాలని ఆయన హితవు పలికారు.

తనకు కూడా తన మాతృభాష అంటే ఎంతో ఇష్టమని.. ప్రజల భాషలోనే పరిపాలన సాగాలని.. అలాగైతేనే పౌరులకు మెరుగైన సేవలు అందుతాయని వెంకయ్య నాయుడు తెలిపారు. అలాగే రాజకీయ నాయకులకు కూడా ఆయన తనదైన శైలిలో చురకలంటించారు. పార్టీలు మారాలని భావించేవారు తొలుత ఏ పార్టీ ప్రోత్సాహంతో పదవులు పొందారో వాటికి రాజీనామా చేశాకే పార్టీలు మారాలని.. పదవులు వదలకుండా పార్టీలు మారడమంటే ప్రజాస్వామ్య వ్యవస్థకి చేటు తేవడమేనని ఆయన తెలిపారు. 

నెల్లూరు జిల్లాలోని చవటపాలెం గ్రామంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన వెంకయ్యనాయుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1977 నుంచి 1980 వరకు జనతా పార్టీ యువజన విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన వెంకయ్య నాయుడు.. 1978లో ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు.  1980లో భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. 1983లో మళ్ళీ అదే స్థానం నుంచి రెండో పర్యాయం శాసనసభ్యుడుగా ఎన్నికై 1985 వరకు కొనసాగారు. 1980లో అఖిల భారతీయ జనతా పార్టీ యువజన విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనారు.

1985లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా నియమించబడి 1988 వరకు కొనసాగి ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించబడ్డారు. 1993 నుండి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 1998లో రాజ్యసభకు ఎన్నుకోబడిన వెంకయ్య నాయుడు.. వాజ్‌పేయి హయాంలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా.. మళ్లీ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా.. మోదీ హయాంలో అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రిగా కూడా సేవలందించారు. 

Trending News