నెల్లూరు జిల్లాలోని "పుట్టంరాజువారి కండ్రిగ" అనే గ్రామం ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజిబిసి)వారు నిర్వహించిన గ్రీన్ ఆడిట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోనే మొట్టమొదటి 'గ్రీన్ విలేజ్" గా ఎంపికై రికార్డులకెక్కింది. ఈ గ్రీన్ విలేజ్ అనేది ప్రధానంగా నీరు, శక్తి, విద్య, ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యం వంటి మౌలిక వనరులను అందిస్తుంది. ఆర్థిక సంపదను, జీవిత నాణ్యతను పెంచడమే ఈ విలేజ్ల లక్ష్యం. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్న గ్రామమే గ్రీన్ విలేజ్‌గా అవార్డు గెలుచుకోవడం మరో విశేషం. అక్టోబర్ 5 నుండి 7 వరకు జైపూర్‌లో జరగనున్న "ది గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 2017 అంతర్జాతీయ సదస్సు"లో ఈ అవార్డును సచిన్ టెండూల్కర్, నెల్లూరు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు రేవుతో కలిసి అందుకోనున్నారు. ఈ విషయాన్ని ఐజిబిసి ఛైర్మన్ డాక్టర్ ప్రేమ్ సి జైన్ ఇటీవలే ప్రెస్ రిలీజ్ ద్వారా తెలియజేశారు.
అవార్డు వెనుక కథ
2 సంవత్సరాల క్రితం సచిన్ టెండుల్కర్ "సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన" పథకంలో భాగంగా దాదాపు 2500 జనాభా కలిగిన కండ్రిగ గ్రామానికి దత్తత తీసుకొని, అక్కడి అధికారులు మరియు గ్రామపెద్దలతో మాట్లాడి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దాదాపు 2.78 కోట్ల రూపాయల విలువైన పనులకు రూపకల్పన చేశారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని గూడూరు మండలంలో భాగమైన కండ్రిగ గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి, ప్రజలలో చైతన్యం తీసుకొచ్చారు. అలాగే ప్రజలను కూడా కార్యక్రమంలో భాగస్వాములను చేయడంతో నిజంగానే అనుకున్న పని సాధ్యమైంది. ఈ కార్యక్రమాలకు అదనంగా సచిన్ అక్కడి పిల్లల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంచడం కోసం క్రీడా మైదానాన్ని నిర్మించడానికి కూడా నిధులు అందించారు. బాలలకు ఉచిత క్రికెట్ కిట్లను కూడా సరఫరా చేశారు. ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నాక, సచిన్ నెర్నూరు, గొల్లపల్లి గ్రామాలను కూడా దత్తత తీసుకున్నారు.
Proud to state our adopted village Puttamraju Kandriga is open defecation free #SwachhBharat The phase 1 work of SAGY is complete! @PMOIndia pic.twitter.com/zAXK8ernUK
— sachin tendulkar (@sachin_rt) November 16, 2016