గుర్తుతెలియని దుండగులు తన భర్తపై విచక్షణా రహితంగా దాడి చేయడం గమనించిన అతడి భార్య హెల్ప్ హెల్ప్ అంటూ అరవలేదు.. తన భర్తను కాపాడండి అంటూ నలుగురిని ప్రాధేయపడలేదు. క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే అక్కడికి చేరుకోవడమే కాకుండా.. వెంటనే వారిపై తన లైసెన్స్‌డ్ తుపాకీతో కాల్పులు జరిపింది. ఈ అనుకోని హఠాత్పరిణామానికి ఖంగుతిన్న రౌడీలు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు అతడిని అక్కడే వదిలేసి పరారయ్యారు. దుండగులు అతడపై సమ్మెటలు, గొడ్డళ్లు, కర్రలతో దాడికి పాల్పడటంతో అప్పటికే అతడి వెన్నెముక, తల భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో ఆదివారం మధ్యాహ్మం బాధితుడి ఇంటిముందే చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది.
#WATCH Man attacked by unknown assailants is saved by gun toting wife in Lucknow district's Kakori. Police begin investigation (4.2.18) pic.twitter.com/7bfp9600WN
— ANI UP (@ANINewsUP) February 5, 2018
ఈ ఘటనలో గాయాలపాలైన బాధితుడి పేరు అబిద్ అలీ. అతడిని కాపాడిన భార్య ఓ న్యాయవాది. ఈ ఘటన అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారి నుంచి సరైన స్పందన కనిపించలేదు. ఇంటి యజమాని, కిరాయిదారుడుకి మధ్య జరిగిన వివాదంగా భావిస్తూ ఘటనని తేలిగ్గా తీసుకున్నారు. దీంతో బాధితులు సీనియర్ ఎస్పీ వద్దకు వెళ్లి మొరపెట్టుకున్న తర్వాతే వారి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఉత్తర్ ప్రదేశ్‌లో శాంతి భద్రతల సమస్య ఏ స్థాయిలో వుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది.