Rajagopal Reddy Controversial Comments : కోమటిరెడ్డి బ్రదర్ గుస్సా వెనుక కారణం అదేనా..? అందుకే సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారా..?

Rajagopal Reddy Controversial Comments : అధికార పార్టీలో ఆ నాయకుడి తీరు మరోసారి కల్లోలం రేపుతుందా ..? వరుస పెట్టి  ఆ లీడర్ సంచలన వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతం..? ఆయన ఆశించి దక్కుతుందని ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారా..?  అనుకున్నది జరగకపోవడంతో మరోసారి తన అసలైన క్యారెక్టర్ ను చూపిస్తున్నారా..? ఆయన తీరుతో ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అటు అధిష్టానం ఆందోళన చెందుతుందా..? ఇంతకీ ఆ లీడర్ ఎవరు ..? ఆయన ఆశిస్తున్నదేంటి..?

Written by - Indupriyal Radha Krishna | Last Updated : Jan 27, 2025, 05:01 PM IST
Rajagopal Reddy Controversial Comments : కోమటిరెడ్డి బ్రదర్ గుస్సా వెనుక కారణం అదేనా..? అందుకే సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారా..?

Rajagopal Reddy Controversial Comments : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న ఈయన ఏం మాట్లాడినా సంచలనమే. ఏం చేసినా సెన్సేషనే. అలాంటి రాజగోపాల్ రెడ్డి గత కొద్ది రోజులుగా మాత్రం సైలెంట్ గా ఉంటూ వచ్చారు. కానీ ఉన్నట్లుండి ఇటీవల ఆయన వరుస బెట్టి చేస్తున్న కామెంట్స్ మాత్రం అధికార పార్టీలో కలకలం రేపుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి చేస్తున్న కామెంట్స్ తో కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు.ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ను టార్గెట్ చేసేలా ఉండడంతో ఆయన ఆలోచన ఏంటా అనే కాంగ్రెస్ లో పెద్ద ఎత్తు చర్చ జరుగుతుంది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీకీ , మళ్లీ తిరిగి బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరారు. 

గత ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరే సందర్భంలో అధిష్టానం నుంచి మంత్రి పదవిపై హామీ తీసుకున్నట్లు ఆయన అనచరులు చెబుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆయనకు మాత్రం మంత్రి పదవి దక్కలేదు. దీంతో కొద్ది రోజులు సైలెంట్ గా ఉండిపోయారు. ఆ సమయంలోనే తాను మంత్రి పదవి ఆశిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డికి, అధిష్టానానికి వెలిబుచ్చారు. ఆదే సమయంలో లోక్ సభ ఎన్నికలు రావడంతో హై కమాండ్ కూడా మంత్రి పదవిపై సానుకూలంగా స్పందించినట్లు గాంధీ భవన్ లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత నుంచి మంత్రివర్గ విస్తరణ రేపు మాపు అంటూ నెలలు గడుస్తుంది తప్పా విస్తరణ మాత్రం జరగడం లేదు దీంతో రాజగోపాల్ రెడ్డి అసహనం పెరిగిపోతుందని ఆయన అనచరులు చెబుతున్నారు.

అధిష్టానం చెప్పింది కాబట్టి చాలా రోజులు వేచి చూశాము. కానీ మంత్రివర్గ విస్తరణ జరగకపోవడంతో ఆయన తీవ్ర నిరాశలో ఉంటున్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత చాలా రోజులు సైలెంట్ గా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మళ్లీ తన నోటికి పని చెబుతున్నారు. గణతంత్ర దినత్సవం సందర్భంగా రేవంత్ సర్కార్ తెలంగాణ వ్యాప్తంగా నాలుగు సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి  తనదైన స్టైల్ లో స్పందించారు. నేను గనుకు బీజేపీలో ఉండి ఉంటే ఈ రోజు రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడు కదూ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఉన్నట్లుండి రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అని చర్చించుకుంటున్నారు. అంతే కాదు రేవంత్ రెడ్డి ప్రస్తావన తీసుకురావడం ఏంటా అని హస్తం నేతలు గుసగుసలు పెట్టుకుంటున్నారు. రేవంత్ రెడ్డి తీరుతో రాజగోపాల్ రెడ్డి ఏదైనా అసంతృప్తిగా ఉన్నారా అని నేతలు ఆరా తీసే పనిలో్ ఉన్నారు.

ఇలా రేవంత్ రెడ్డి టార్గెట్ చేసిన వ్యాఖ్యలు మరువక ముందే మరుసటి రోజే మరో సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు . ఈ సారి కూడా రేవంత్ రెడ్డి, పార్టీనీ మరింత ఇబ్బందులకు గురి చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. సంక్షేమ పథకాల పంపిణీలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్ది ఇప్పటికీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ మెచ్చుకుంటున్నారని కుండబద్దలు కొట్టాడు. అంతటితో ఆగని రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు తిడుతున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు. రైతుభరోసా 15వేలు అని 12 వేలు ఇవ్వడంపై రైతులు ఆగ్రహంగా ఉన్నారని రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే కామెంట్స్ చేశారు. దీంతో కాంగ్రెస్ అలజడి రేగుతుంది. రాజగోపాల్ రెడ్డి మళ్లీ తన పాత స్టైల్ లో రెచ్చిపోతున్నారంటూ పార్టీలో ప్రచారం జరగుతుంది.

ఐతే రాజగోపాల్ రెడ్డి  కామెంట్స్ పై రకరకాల చర్చ జరుగుతుంది. ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశాలు లేకపోవడంతో ఆయన ఇలా మాట్లాడుతున్నారని కొందరి విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే నల్లగొండ జిల్లా నుంచి ఆయన సోదరుడు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. దీనికి తోడు మాజీ పిసిసి అధ్యక్షలు సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మంత్రిగా కొనసాగుతున్నారు. ఇలాంటి సమయంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కడం ఆషామాషీ కాదంటున్నారు.అందునా ఒకే సామాజికవర్గం, ఒకే జిల్లా నుంచి ముగ్గురికి మంత్రి పదవులు ఇస్తే వ్యతిరేక సంకేతాలు వెళుతాయని అంటున్నారు. ఈ విషయం తెలిసే రాజగోపాల్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారని అంటున్నారు.

మరోవైపు రాజగోపాల్ రెడ్డి విషయంలో ఇప్పుడు అధిష్టానం కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ ఏం చేస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. ఆయన చేస్తున్న వ్యాఖ్యల వెనుక ఉన్న పరమార్థం ఏంటి..? ఇప్పటికే పలుమార్లు పార్టీ మార్పుతో సంచలనాల సృష్టించిన రాజగోపాల్ రెడ్డి మరోసారి అలాంటి ఆలోచన ఏదైనా చేస్తున్నారా అని చర్చ జరుగుతుంది. అందుకే  బీజేపీ, కేసీఆర్ ప్రస్తావన తెస్తున్నారా ఆయన వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తుంది.
 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News