Best Home Remedies for Toothache: చలి కాలంలో ఎక్కువగా కనిపించే ఆరోగ్య సమస్యల జాబితాలో టూత్ పెయిన్, చిగుళ్ల నొప్పి కూడా ఉంటాయి. అందుకు కారణం చల్లటి వాతావరణంలో దంతాలు, చిగుళ్లు సున్నితంగా మారడమే. అయితే, ఈ దంతాల నొప్పి, చిగుళ్ల నొప్పి సమస్యలకు వీలైనంత వరకు ఒంటింటి చిట్కాలే ఉపశమనాన్ని ఇస్తాయి. ఒకవేళ మరీ భరించలేనంత నొప్పి కలిగితే అప్పుడు డాక్టర్‌ని సంప్రదించకతప్పదు. అయితే, డాక్టర్‌ని ఎప్పుడు సంప్రదించాలి, ఎంత తీవ్రత వరకు ఒంటింటి చిట్కాలతో సమస్యకు చెక్ పెట్టవచ్చనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సాల్ట్ వాటర్:
ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీరు తీసుకుని అందులో సగం టేబుల్ స్పూన్ ఉప్పు వేయండి. ఆ నీటితో కొద్దిసేపు నోటిలో పట్టుకుని పుక్కిలించిన తరువాత ఉమ్మివేయండి. నోటిలోని బ్యాక్టీరియాను క్లీన్ చేసేందుకు ఇది సహజ పద్ధతి. ఉప్పుతో కలిపిన గోరువెచ్చటి నీరు న్యాచురల్ డిస్‌ఇన్‌ఫెక్టంట్‌గా ఉపయోగపడుతుంది.
అలైవెరా జెల్:
అలైవెరా.. అదేనండి కలబందలో యాంటీ బ్యాక్టిరియా గుణాలు ఉంటాయి. ఇవి దంతాల నొప్పి, చిగుళ్ల నొప్పి నివారణకు చక్కటి మెడిసిన్ గా పనిచేస్తాయి. బాగా నొప్పిగా ఉన్న ప్రాంతంలో కలబంద జెల్ ని రుద్దితే అది నొప్పి నివారిణిగా పనిచేస్తుంది.
టీ బ్యాగ్స్:
గ్రీన్ టీ, హైబిస్కస్ టీ, బ్లాక్ టీలో ఉండే టానిన్స్ గమ్ పెయిన్‌కి చెక్ పెడతాయి. గోరువెచ్చగా ఉన్న టీ బ్యాగ్ తీసుకుని నొప్పిగా ఉన్న ప్రాంతంలో 5 నిమిషాల పాటు రుద్దితే.. నొప్పి హుష్ కాకి అవుతుందట.
వెల్లుల్లి:
వెల్లుల్లిలో అలిసిన్ అనే ఔషధం ఉంటుంది. ఈ ఔషధంలో ఉండే యాంటీ బ్యాక్టీరియా దంతాల నొప్పిని, చిగుళ్ల నొప్పిని నయం చేస్తుంది. తాజాగా చేసిన వెల్లుల్లి పేస్టును నొప్పిగా ఉన్న ప్రాంతంలో రుద్దితే నొప్పి తగ్గిపోతుంది. లేదంటే ఒక వెల్లుల్లి రెబ్బని నమిలి నొప్పి ఉన్న ప్రాంతంలో కాసేపు పట్టితే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
లవంగ నూనె:
లవంగ నూనేలో యుగెనాల్ మూలకాలు ఉంటాయి. ఇవి న్యాచురల్ ఎనస్థిటిక్‌గా పనిచేస్తాయి. అంటే నొప్పి నివారించేలా ఆ ప్రాంతం మొద్దుబారిపోయేలా చేస్తుందన్నమాట.
అలా అయితే డెంటిస్ట్‌ని కలవాల్సిందే..
అనారోగ్య సమస్య ఏదయినా.. ఆరంభ దశ వరకే ఒంటింటి చిట్కాలు మెరుగ్గా పనిచేస్తాయి. ఒకవేళ ఈ ఒంటింటి చిట్కాలు అన్ని ప్రయత్నించినా ఉపశమనం లభించడం లేదంటే.. అసలు సమస్య ఎక్కడుందో అంచనా వేసి అందుకు అవసరమైన, మెరుగైన చికిత్స తీసుకోవడానికి వైద్యుడిని సంప్రదించడమే ఉత్తమం.