Mega Brothers: మెగాస్టార్ కుటుంబంలో విభేదాలు వచ్చాయా? చిరంజీవి, పవన్ కల్యాణ్ మధ్య గ్యాప్ వచ్చిందా?అంటే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఏలూరు జిల్లా భీమవరం వచ్చారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహం ఆవిష్కరించారు. అక్కడే నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా మెగాస్టార్ ఫ్యామిలీ సొంత జిల్లాలో ఉంది. భీమవరం నుంచి గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేశారు. భీమవరంలో జరిగిన అల్లూరి జయంతి వేడుకలకు చిరంజీవి, పవన్ కల్యాణ్ ను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించారు. ఈ వేడుకకు చిరంజీవి వచ్చారు. కాని జనసేన చీఫ్ పవన్ రాలేదు. గత ఎన్నికల్లో భీమవరంలో పోటీ చేసిన పవన్.. భీమవరానికి ప్రధాని మోడీ వచ్చినా... తనకు ఆహ్వానం ఉన్నా ఎందుకు వెళ్లలేదన్నది ప్రశ్నగా మారింది. అన్న వెళ్లడం వల్లే తమ్ముడు భీమవరం సభకు వెళ్లలేదనే చర్చ సాగుతోంది. దీంతో మెగా బ్రదర్స్ మధ్య విభేదాలు వచ్చాయా అన్న అనుమానాలు వస్తున్నాయి.
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం పవన్ కల్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. పొత్తు రాజకీయాల్లో జనసేనే పార్టీనే కీలకంగా మారింది. అదే సమయంలో వరుస కార్యక్రమాలతో దూకుడు పెంచారు పవర్ స్టార్. కైలు రైతు భరోసా పర్యటనలతో జనంలోకి వెళుతున్నారు. దసరా తర్వాత పూర్తిగా ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలు వేసుకున్నారు పవన్ కల్యాణ్. బీజేపీతో పొత్తు ఉన్నా ఒంటరిగానే రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సడెన్ గా ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం పర్యటనలో పాల్గొన్నారు. సీఎం జగన్ తో కలిసి వేదిక పంచుకున్నారు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
భీమవరం సభా వేదికపై జగన్ తో సన్నిహితంగా మెలిగారు. తన ప్రసంగంలో చిరంజీవిని అన్న అని ఆత్మీయంగా సంభోదించారు సీఎం జగన్. సభ ముగిసిన తర్వాత చిరంజీవి, జగన్ గుసగుసలు పెట్టుకున్నారు. ఏపీ టూరిజం శాఖ మంత్రి రోజా చిరంజీవితో కలిసి జోరుగా సెల్ఫీలు దిగారు. ఈ ఘటనలే కొత్త చర్చకు దారి తీశాయి. చిరంజీవి ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ దగ్గరయ్యారా అన్న చర్చలు సాగుతున్నాయి. మాములుగా ఎవరిని పట్టించుకునే రకం కాదు జగన్. కాని చిరంజీవి విషయంలో మాత్రం డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. చిరుకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తున్నారు. సినిమా టికెట్ల వివాదంలో చిరంజీవితోనే చర్చించారు సీఎం జగన్. చిరు సూచనల ప్రకారమే ఆన్ లైన్ టికెట్ల విషయంలో నిర్ణయం తీసుకున్నారనే టాక్ వచ్చింది. సినిమా పరిశ్రమకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ చిరంజీవి చెప్పినట్లే చేయాలని సంబంధిత అధికారులను జగన్ ఆదేశించారని సచివాలయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇవన్ని జగన్, చిరంజీవి మధ్య సఖ్యత పెరిగిందని చెబుతున్నాయి.
ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల సమయంలోనూ చిరంజీవి పేరు తెరపైకి వచ్చింది. వైసీపీ నుంచి చిరంజీవిని పెద్దల సభకు పంపించాలని జగన్ ఆలోచిస్తున్నారనే వార్తలు వచ్చాయి. గతంలో కాంగ్రెస్ నుంచి రాజ్యసభ ఎన్నికై కేంద్ర మంత్రి అయ్యారు చిరంజీవి. తాజాగా భీమవరం ప్రధాని మోడీ పర్యటనలో సీఎం జగన్, చిరంజీవి రాసుకుపూసుకు తిరగడంతో వైసీపీకి చిరంజీవి దగ్గరయ్యారనే వాదనలకు బలం చేకూరుతోంది. జగన్ తో చిరంజీవి సన్నిహితంగా ఉండటమే పవన్ తో గ్యాప్ పెరగడానికి కారణమని అంటున్నారు. జగన్ టార్గెట్ గా దూకుడుగా వెళుతున్నారు పవన్. జైలు పక్షి అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అటు వైసీపీ నేతలు పవన్ చంద్రబాబు దత్తపుత్రడంటూ కౌంటరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్ తో చిరంజీవి సన్నిహితంగా ఉండటాన్ని పవన్ జీర్ణించుకోలేకపోతున్నారని.. అందుకే అన్నయ్యకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు,
పవన్ రాజకీయ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నందు వల్లే చిరంజీవి జగన్ తో సన్నిహితంగా ఉంటున్నారనే మరో చర్చ కూడా సాగుతోంది. కొంత కాలంగా తెలుగు దేశం పార్టీతో పొత్తు దిశగా పవన్ సంకేతాలు ఇస్తున్నారు. అవసరమైతే బీజేపీ పొత్తుకు బైబై చెప్పి టీడీపీతో కలిసి పనిచేయాలనే ప్లాన్ లో ఉన్నారనే టాక్ వచ్చింది. ఈ విషయంలో పవన్ తో చిరంజీవి విభేదించారని అంటున్నారు. టీడీపీతో పొత్తు వద్దన్నది చిరంజీవి అభిప్రాయమంటున్నారు. మరోవైపు చిరంజీవిని బీజేపీలో చేర్చుకుంటే బాగుంటుందనే ఆలోచనలోనే బీజేపీ ఉందనే ప్రచారం ఉంది. చంద్రబాబుకు మద్దతుగా పవన్ ఉంటున్నారని గ్రహించిన బీజేపీ పెద్దలు చిరును ఆకర్శిస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇందుకు సీఎం జగన్ సహకారం కూడా ఉందంటున్నారు. మొత్తంగా సీఎం జగన్, బీజేపీ పెద్దల డైరెక్షన్ లోనే చిరంజీవికి భీమవరం ఆహ్వానం వచ్చిందంటున్నారు. ఈ మొత్తం పరిణామాలతో చిరు-పవన్ మధ్య గ్యాప్ వచ్చిందనే వాదనే ఎక్కువగా వినిపిస్తోంది. ఏపీ మేథావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మెగా బ్రదర్స్ విషయంలో సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ లబ్ది కోసం చిరంజీవి, పవన్ కల్యాణ్ మధ్య చిచ్చు పెట్టారని ఆరోపించారు. ఈ కామెంట్లు ఏపీలో సంచలనంగా మారాయి.
Read also: CM KCR: మోడీ, షా దెబ్బకు టీఆర్ఎస్ షేక్.. ఈటలతో టచ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు?
Read also: Pawan Kalyan: ప్రధాని మోడీ గారు మీతో కుదరదంతే..! భీమవరం సభ సాక్షిగా బీజేపీతో పవన్ కల్యాణ్ కటీఫ్?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook