తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిపై దాడికి పాల్పడుతున్నానని భావించిన సోమన్న అనే వ్యక్తి, తనకు తెలియకుండానే పొరపాటున తన కన్న కొడుకుపై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. కన్న తండ్రి తనపై దాడికి పాల్పడబోతున్నాడని ఆలస్యంగా గుర్తించిన అతడి కొడుకు పరశురామ్.. ఆ దాడికి ఎదురు తిరిగి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే అతడు తండ్రి చేతిలో గొడ్డలి దాడికి గురయ్యాడు. కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం గుటుపల్లె గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో మంచంపై పడుకున్న పరశురామ్‌ని మరొక వ్యక్తిగా భావించి పొరపాటుపడిన సోమన్న.. విచక్షణ కోల్పోయి అతడిపై దాడికి పాల్పడ్డాడు.
ఘటన అనంతరం తన తప్పిదం తెలుసుకున్న సోమన్న.. "తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వాడికి బుద్ధి చెప్పాలనే క్షణికావేశంలో పొరపాటున తానే తన కొడుకుపైనే దాడి చేశానే" అని బావురుమన్నాడు. సోమన్న చేతిలో దాడికి గురైన అతడి 14 ఏళ్ల తనయుడు పరశురామ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కొడుకుపై దాడికి పాల్పడిన సోమన్నపై బేతంచర్ల పోలీసులు సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు. గత కొన్నిరోజులుగా సోమన్నకు, అతడి కొడుకుకు మధ్య కూడా కుటుంబ సమస్యల విషయమై ఘర్షణ జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ది హన్స్ ఇండియా ప్రచురించిన ఓ కథనం ప్రకారం సోమన్న భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం వుండటమే ఈ ఘటనకు కారణమైందని సమాచారం.
భార్య లవర్ అనుకుని.. కన్న కొడుకుపై !