పాకిస్తాన్ ఎన్నికల్లో ఇటీవలే గెలిచి ప్రధాని అవ్వడం కోసం చిన్న చితకా పార్టీల మద్దతు కోరుతున్న ఇమ్రాన్ ఖాన్.. ఒకవేళ తాను ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తే ఆ మహోత్సవానికి భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తానని తెలపడం గమనార్హం. భారత ప్రధానితో పాటు తాను ఆ మహోత్సవానికి సార్క్ దేశాల అధినేతలు అందరినీ కూడా ఆహ్వానించాలని భావిస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఇటీవలే జరిగిన పాకిస్తాన్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్ ఐ ఇన్సాఫ్ ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇచ్చి అధిక ఓట్లు పొందిన అతి పెద్ద పార్టీగా అవతరించింది.
అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తాము గెలుపొందిన సీట్ల సంఖ్య చాలకపోవడంతో ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం ఇతర పార్టీల మద్దతు కోరుతున్నారు. ఇటీవలే ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ విజయం సాధించాక.. స్వయానా మోదీయే ఫోన్ చేసి మాట్లాడి తనకు అభినందనలు తెలియజేశారని ఆయన అన్నారు. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య బంధాలను పటిష్టం చేయడానికి తమ పార్టీ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
అయితే ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి మోదీని ఆహ్వానించే విషయం గురించి విదేశాంగ శాఖతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఫవద్ చౌదరి తెలిపారు. గతంలో నరేంద్ర మోదీ కూడా తాను భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో సార్క్ దేశాల అధినేతలను ఆహ్వానించారు. అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా ఆ మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.