భారతదేశంలో ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్య, ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై జరుగుతున్న బెదిరింపులపై అగ్రరాజ్యం యుఎస్ హౌస్ ఆఫ్ రెప్రజంటేటివ్స్ లో చర్చ జరిగింది. భావప్రకటన స్వేచ్ఛపై జరుగుతున్న దురాగతాలు అన్న అంశంపై ప్రస్తావిస్తూ.. "భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ బాగోలేదని.. అందుకు నిదర్శనం గౌరీ లంకేశ్ హత్య, ప్రొఫెసర్ ఐలయ్య, ఇతర రాష్ట్రాల్లో జర్నలిస్టులపై జరుగుతున్న ఉదంతాలే కారణం" అని రిపబ్లికన్ ప్రతినిధి హెరాల్డ్ ట్రెంట్ ఫ్రాంక్స్ యూఎస్ కాంగ్రెస్ ను ఉద్దేశించి మాట్లాడారు.
మాట్లాడే స్వేచ్ఛ నశిస్తోందని, సామాజిక మాధ్యమాల్లో తన అభిప్రాయాలను చెప్పిన వారికి సైతం శిక్షలు వేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాల్లో అధికారం కోసం జరుగుతున్న వర్గపోరులో భాగంగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని.. భావ ప్రకటన స్వేచ్ఛ కోసం పోరాడిన గోవింద్ పన్సరే, ఎంఎం కల్బుర్గి, నరేంద్ర దభోల్కర్ హత్యల మాదిరి గౌరీ లంకేశ్ హత్య కూడా జరిగిందని ప్రస్తావించారు. ఇండియాలో ఒక కులం సామాజిక పెత్తనంపై రాసిన కంచ ఐలయ్యను బహిరంగంగా ఉరితీయాలని ఒక ఎంపీ హెచ్చరించాడని, అక్కడి ప్రజా ప్రతినిధులే భావ ప్రకటను అడ్డుకుంటున్నారని, దీనిపై భారత్ వెంటనే స్పందించాలని, అవసరమైతే భారత్ పై ఒత్తిడి తీసుకురావాలని ఫ్రాంక్స్ యూఎస్ కాంగ్రెస్ ను కోరారు.