Telangana Politics: ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ప్రజా నాయకుడిగా పేరుంది. కాంగ్రెస్ కష్టకాలంలోనూ ఆయన పార్టీని అంటిపెట్టుకొని ఉండి ప్రజాగొంతుకగా పనిచేశారు. ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా కమ్యూనిస్టులు వైరా స్థానాన్ని బలంగా కోరుకున్నారు. అయితే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుచురుడి కోటాలో ఆయనకు పార్టీ ఆధిష్టానం టికెట్ కేటాయించింది. అయితే బీఆర్ఎస్ నుంచి ప్రత్యర్థిగా పోటీ చేసిన మదన్ లాల్ బలమైన అభ్యర్థి కావడంతో రాందాస్ నాయక్ గెలుపు కోసం కాంగ్రెస్ శ్రేణులు కష్టపడి పనిచేసి మంచి మెజార్టీతో రాందాస్ నాయక్‌ను గెలిపించుకున్నారు. ఎన్నికల తరువాత జరిగిన పరిణామాలతో పలువురు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటివరకు తన గెలుపు కోసం పనిచేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పక్కకు పెట్టి కొత్తగా పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇన్నాళ్లు భట్టి అనుచరుడిగా ఉన్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తన రూట్ మార్చినట్లు తెలుస్తోంది. భట్టి జిల్లాకు వచ్చినప్పుడు ఆయన వెంట కనిపిస్తూనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోనూ స్నేహ హస్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి వైరా నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మొదటి నుంచి భారీ సంఖ్యలో అనుచరగణం ఉంది. అందుకే నియోజకవర్గంలో పనులు కావాలంటే మంత్రి పొంగులేటి వెంట ఉండక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో భట్టి కంటే పొంగులేటి వెంటే ఎమ్మెల్యే ఎక్కువగా కనిపిస్తున్నారని ఓ వర్గం కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. అటు ఎమ్మెల్యే గెలుపు కోసం పనిచేసిన వారిని ఆయన పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఫ్యామిలీలోని ఓ వ్యక్తి షాడో ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఎమ్మెల్యే కంటే ఆయన చెబితేనే పనులు జరుగుతున్నాయని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అటు నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఉన్న పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందట. ఎమ్మెల్యే పార్టీ క్యాంపు ఆఫీసుకు సమయం ఇవ్వకుండా ఎక్కువ సమయం తన సొంత ఇంటిలోనే ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. ఇందుకు ఓ కారణముందనే టాక్ వినిపిస్తోంది.
త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే వైరా జనరల్ స్థానంగా ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు జూలూరుపాడు, కారేపల్లి ఎస్టీగా రిజర్వ్ అయ్యే అవకాశం ఉన్నందున ఆయన ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. ఏదో చుట్టాపు చూపుగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వచ్చిపోతున్నట్లు క్యాడర్ చర్చించుకుంటోంది. అంతేకాదు క్యాంప్ ఆఫీస్‌కు రాకపోవడానికి మరో కారణం ఉందంట.. క్యాంప్ ఆఫీస్ వాస్తుకు లేకపోవడంతో కలిసి రాదనే భావనలో ఆయన ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన అక్కడకు రావడం లేదట. దీంతో ఏమైనా పనుల కోసం ఎమ్మెల్యేను కలవాలంటే కష్టంగా ఉందని చెబుతున్నారు.. ఎమ్మెల్యే కాక ముందు ఒకలా.. ఎమ్మెల్యే అయ్యాక మరొలా రాందాస్ నాయక్ వ్యవహరిస్తున్నారని నియోజకవర్గ ప్రజలు చెవులు కోరుక్కుంటున్నారు..
మరోవైపు ఇద్దరు మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మధ్య ఎమ్మెల్యే నలిగి పోతున్నట్లు తెలుస్తోంది. ఒకరితో స్నేహంగా ఉంటే మరొకరికి కోపం వచ్చే పరిస్థితి ఉందని ఆయన భావిస్తున్నారట. దాంతో నియోజకవర్గ అభివృద్ధిపై అది ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన మదనపడుతున్నట్లు సమాచారం. అందుకే ఇద్దరు మంత్రులతో స్నేహం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే పొంగులేటితో ఎమ్మెల్యే స్నేహ హస్తం చేయడం భట్టి అనుచరులకు రుచించడం లేదట. బహిరంగంగా ఇది చెప్పినప్పటికీ మనస్సులో మాత్రం ఎమ్మెల్యే తీరుపై వారు అసహనంతో ఉన్నట్లు సమాచారం. మరోవైపు నామినేట్ పదవుల్లో కూడా ఇద్దరు మంత్రుల అనుచరులతో కొత్త తలనొప్పులు వచ్చే అవకాశం ఉందని దీనిని ఆయన ఎలా అధిగమిస్తారో చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు..
మొత్తంమీద వైరా నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎమ్మెల్యేలు అయినా నేతలు.. రెండవసారి గెలిచిన సందర్భాలు లేవనే చెప్పాలి. ఈ రికార్డును తాను అధిగమించాలని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ భావిస్తున్నారట. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని రాందాస్ నాయక్‌కు సూచనలు వస్తున్నాయట. లేదంటే ముందు ముందు గడ్డుపరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ప్రజలు చెబుతున్నట్టు తెలుస్తోంది.