Telangana Congress :రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం కావొస్తుంది. ఈ సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ రూపంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.రేవంత్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలిటిక్స్ కు దూరంగా ఫాం హౌజ్ లో ఉన్నా..కాంగ్రెస్ కు మాత్రం బీఆర్ఎస్ నుంచి పెద్ద ప్రతిఘటన ఎదురవుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలను పరిశీలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఏ విధంగా టార్గెట్ చేస్తుందో అర్థం అవుతుంది. సంవత్సరం కాలం కాక ముందే ప్రజల్లో కాంగ్రెస్ పై వ్యతిరేకత తెచ్చేలా బీఆర్ఎస్ రకరకాల వ్యూహాలు అమలు చేస్తుంది. అందులో కొన్ని విఫలమవుతున్నా ..మరి కొన్ని మాత్రం ప్రజల్లో ఆలోచనను రేకెత్తిస్తున్నాయి.
ముఖ్యంగా కాంగ్రెస్ కు ఉద్యోగాల భర్తీ అనేది ఇప్పుడు అతి పెద్ద సవాల్ గా మారింది. ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎం అవగానే ఉద్యోగాల భర్తీ కోసం కార్యాచరణను ప్రకటించింది. కానీ రేవంత్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం నిరుద్యోగులను మాత్రం సంతృప్తి పరచడం లేదు. అంతే కాదు దీనికి తోడు ఇటీవల జీఓ నెం.59 అనేది రాష్ట్రంలో పెద్ద దుమారాన్నే రేపింది. గ్రూప్ వన్ పరీక్షలను రద్దు చేయాలని నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీనికి ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. బీఆర్ఎస్ కూడా నిరుద్యోగులకు అండగా నిలవడంతో వారి ఆందోళన తీవ్రతరం అయ్యింది. ఈ అంశం చివరకు కోర్టుకు చేరి ప్రభుత్వం పరీక్ష నిర్వహించడానికి మార్గం సుగుమం అయ్యింది. ఈ నిరుద్యోగుల అంశం మాత్రం కాంగ్రెస్ ను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.
ఇక రైతుల సమస్యపై కూడా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. రుణమాఫీనీ చాలా సీరియస్ గా తీసుకున్న రేవంత్ రెడ్డి అన్న మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ చేపట్టారు. ఐతే దీనీ పై బీఆర్ఎస్ తీవ్రంగా ఆక్షేపణ చేపట్టింది. కొందరికి మాత్రమే రుణమాఫీ అయ్యింది.ఇంకా చాలా మంది రైతులకు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉందని. రేవంత్ సర్కార్ రైతులను మోసం చేస్తుందని బీఆర్ఎస్ కాంగ్రెస్ పై ఎదురుదాడికి దిగింది.దీంతో పాటు పలు జిల్లాలో రైతులతో కలిసి ఆందోళనకు దిగింది.వీటితో పాటు మరో కీలక అంశం హైడ్రాపై కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ తీరుపై విరుచుకుపడింది. హైడ్రా విషయంలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ ను కార్నర్ చేసింది.
తాజాగా లగచర్ల ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారింది. ఫార్మాసిటీ కోసం జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ఏకంగా జిల్లా కలెక్టర్ పై దాడి జరగడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఈ అంశంలో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్దం కొనసాగుతుంది. ఇవే కాకుండా కాంగ్రెస్ తీసుకుంటున్న అనేక నిర్ణయాలను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రజల్లో కాంగ్రెస్ సర్కార్ పై వ్యతిరేకత వచ్చేలా బీఆర్ఎస్ ఏ అవకాశం వచ్చినా వదులుకోవడం లేదు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ లో మాత్రం కొందరు నేతల తీరు మాత్రం ఆశ్చార్యానికి గురి చేస్తుంది. బీఆర్ఎస్ ఒక వైపు సొంత ప్రభుత్వం, పార్టీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతుంటే కాంగ్రెస్ లోని కొందరు సీనియర్లు మాత్రం కనీసం స్పందించడం లేదంట. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్,హరీష్ రావు మాత్రం ప్రభుత్వంపై ఒంటి కాలు మీద లేస్తుంటే కాంగ్రెస్ సీనియర్లు మాత్రం తమకేమీ పట్టనట్లు ఉంటున్నారనే టాక్ కాంగ్రెస్ లోనే వినిపిస్తుంది.
గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన నేతలు సైతం ఇప్పుడు నోరు తెరవడం లేదట. అలాంటి నేతల్లో ముఖ్యంగా వినిపిస్తున్న పేర్లలో కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, సీనియర్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి,దానం నాగేందర్, మల్ రెడ్డి రంగారెడ్డి లాంటి నేతలు ఉన్నారు. ఇందులో మెజార్టీ నేతలు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నవారే కావడం విశేషం. ప్రభుత్వంపై ప్రతిపక్షం ఇంతలా ఎదురు దాడికి దిగుతుంటే ప్రభుత్వానికి , సీఎం రేవంత్ రెడ్డికి అండగా ఉండాల్సిన నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు ఈ నేతల మౌనం వెనుక ఉన్న మర్మం ఏంటా అని కాంగ్రెస్ లోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.మంత్రి పదవి వస్తే తప్పా తమ నేతలు ఆక్టివ్ అయ్యే అవకాశం లేదని నేతల అనచరగణం అంటోంది.
కాగా ఈ నేతల మౌనంపై ఆ నేతల అచరగణాన్ని అడిగితే వాళ్ల నుంచి వస్తున్న సమాధానం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తమ నేతలు ఆ పదవిపై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారని కానీ అధిష్టానం మాత్రం ఎటూ తేల్చడం లేదనే తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని చెబుతున్నారు. నెలల తరబడి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకుంటే వారి ఆశలను అధిష్టానం అడియాశలు చేస్తుందని వారు చెప్పుకొస్తున్నారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతుంది. గత నాలుగైదు నెలలుగా త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం తప్పా విస్తరణ అయ్యింది లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతి సారీ మంత్రి వర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్నవారిలో ఎక్కడో ఏదో మూలన ఆశ కానీ వారు ఆశలు మాత్రం నెరవేరడం లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం మహారాష్ట్ర ఎన్నికలపై దృష్టి పెట్టింది . ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ చేయడం అనుమానమే అని కాంగ్రెస్ నేతలే అంటున్నారు.
మంత్రివర్గ విస్తరణ అయ్యేంత వరకూ ఈ నేతలు మౌనవ్రతం వీడలే లేరు. అదే సమయంలో కాంగ్రెస్ పై మాత్రం రోజురోజుకు బీఆర్ఎస్ అటాక్ మాత్రం పెంచుతుంది.ఇలాంటి సమయంలో సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిపక్షాల నుంచి నుంచి ఎదురవుతున్న సవాళ్లు ఒక వైపు ఉంటే స్వపక్షంలోని నేతల అసంతృప్తి పెద్ద తలనొప్పిగా మారింది.మరి సీఎం రేవంత్ రెడ్డి ఈ అసంతృప్త నేతలను ఎలా బుజ్జగిస్తారు..? ఆ నేతలు మళ్లీ మునపటిలా ఎప్పుడు యాక్టివ్ అవుతారనేది మాత్రం మరి కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.
Telangana Congress : ఆ నేతల మౌనం వెనుక ఉన్న మర్మం ఇదేనా....మంత్రి పదవి ఇస్తేనే మౌనం వీడుతారా..?