Congress Politics: పోస్టుల కోసం కుస్తీ.. వంశీ వర్సెస్‌ కసిరెడ్డి!

Challa Vamshi Chand Reddy: సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు సాగుతోందా..! నామినేటేడ్ పోస్టుల విషయంలో ఓ సీనియర్‌ నేత వర్సెస్ ఎమ్మెల్యేగా సీన్ మారిపోయిందా..! పోస్టుల పంపకాల్లో ఇద్దరు నేతలు ఎక్కడ తగ్గకపోవడంతో క్యాడర్‌ ఉక్కిరిబిక్కిరి అవుతోందా..! ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది..!

Written by - G Shekhar | Last Updated : Jan 14, 2025, 03:00 PM IST
Congress Politics: పోస్టుల కోసం కుస్తీ.. వంశీ వర్సెస్‌ కసిరెడ్డి!

Kasireddy Narayan Reddy: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి ఏడాది అయ్యింది. దాంతో అన్ని నియోజకవర్గాల్లో నామినేటేడ్‌ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అయితే పోస్టుల పంపిణీలో పాత నేతలకు వదిలేసి కొత్తగా వచ్చిన లీడర్లకు పోస్టులు ఇస్తుండటంతో అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. తాజాగా నాగర్‌ కర్నూలు జిల్లా కల్వకుర్తి కాంగ్రెస్‌లోని పోస్టుల పంపిణీలో ఆధిపత్య పోరు కనిపిస్తోంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచందర్‌ రెడ్డి నామినేటేడ్‌ పోస్టుల పంపిణీలో తనదైన మార్క్‌ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇద్దరు నేతలు ఎక్కడ తగ్గకపోవడంతో పోస్టుల పంపిణీ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కసిరెడ్డి నారాయణ రెడ్డి.. అసెంబ్లీ ఎన్నికలకు ముందువరకు ఆయన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎన్నికల సమయంలో గులాబీ పార్టీ హైకమాండ్‌ కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. కల్వకుర్తిలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీలో బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ను ఓడగొట్టారు. కానీ అప్పటికే కల్వకుర్తిలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన చల్లా వంశీచంద్‌ రెడ్డి ఎంపీగా పోటీ చేయడంతో కసిరెడ్డికి ఎలాంటి ఇబ్బందులు రాలేదు.. కానీ వంశీచంద్‌రెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోవడం.. తిరిగి ఆయన కల్వకుర్తిపై ఫోకస్‌ పెట్టడంతోనే తాజాగా వివాదం రాజుకున్నట్టు తెలుస్తోంది.

ఇక చల్లా వంశీచంద్‌ రెడ్డి సొంతూరు కల్వకుర్తి కావడంతో ఆయనకు నియోజకవర్గంపై తొలినుంచి మంచి పట్టుంది. ఆయన 2014లోనూ కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దాదాపు పదేళ్లుగా అనుచరగణాన్ని ఆయన పెంచి పోషిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ ఎంపీగా పోటీ చేసినా వంశీచంద్‌ రెడ్డి.. బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన చూపు మరోసారి కల్వకుర్తిపై పడిందని సమాచారం. మరోవైపు నియోజకవర్గంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా కసిరెడ్డి నారాయణ రెడ్డి నియోజకవర్గంపై తనపట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే తన వర్గానికే పోస్టులు పంపిణీ చేస్తున్నారు. దాంతో మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌ రెడ్డి నారాజ్‌ అయ్యినట్టు తెలుస్తోంది. పోస్టులన్నీ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అనుచరులకే దక్కుతుండటంతో వంశీ వర్గం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. మొదటి నుంచి పార్టీ జెండాలు మోసిన కార్యకర్తలను వదిలేసి కొత్తగా వలస వచ్చిన నేతలకు పదవులు ఇవ్వడం ఏంటని వంశీ వర్గం మండిపడిపోతోందట. పోస్టులన్నీ కొత్తగా వచ్చిన లీడర్లకే ఇచ్చుకుంటే పోతే మేమేం చేయాలనీ ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. అయితే పోస్టుల విషయంలో కసిరెడ్డి వర్గం కూడా పట్టువిడవకపోవడంతో కల్వకుర్తి పాలిటిక్స్‌ ఏ మలుపు తీసుకుంటాయోనని నియోజకవర్గంలో ప్రజలు తెగ చర్చికుంటున్నారట.

మొత్తంగా త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈలోపు నామినేటేడ్ పోస్టుల పంపిణీ వ్యవహారాన్ని చల్లార్చక పోతే.. గట్టి దెబ్బే పడుతుందని వంశీ వర్గం హెచ్చరిస్తోందట. అంతేకాకుండా త్వరలోనే పార్టీ పెద్దలను కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేసే ఆలోచనలో వంశీవర్గం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వంశీ వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎలా స్పందిస్తారు..! ఫిర్యాదు చేసినా అలాగే ఊరుకుంటారా..! కౌంటర్‌గా ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది..

Also Read: Liquor Price Dwon: ఏపీ ప్రజలకు 'సంక్రాంతి కిక్కు'.. భారీగా మద్యం ధరలు తగ్గుముఖం

Also Read: Padi Kaushik Reddy: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డికి భారీ ఊరట.. బెయిల్‌పై విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News