Telangana Politics: మొక్కుబడి ఎమ్మెల్యే మాకొద్దు.. ఓడిపోయినా ఆయనే మా ఎమ్మెల్యే!

Elected MLA Playing As Dummy In Telangana: బీఆర్ఎస్‌కు ఆ జిల్లా కంచుకోట. కాంగ్రెస్ హవాను తట్టుకుని గెలిచి నిలిచారు అక్కడి ఎమ్మెల్యేలు. గెలిచిన వారిలో ఓ ఎమ్మెల్యే మాత్రం కేడర్ సమస్యల పరిష్కారానికి నామమాత్రంగా కూడా ప్రయత్నించడం లేదట. దీంతో ఈ మొక్కుబడి ఎమ్మెల్యేతో ఏం లాభం అంటూ కింది స్థాయి నాయకులు పెదవి విరుస్తున్నారట. ఇంతకీ ఎక్కడా ఆ వ్యవహారం.. ఎవరా పొలిటీషియన్.. వాచ్ దిస్ స్టోరీ.

Written by - G Shekhar | Last Updated : Feb 4, 2025, 08:01 PM IST
Telangana Politics: మొక్కుబడి ఎమ్మెల్యే మాకొద్దు.. ఓడిపోయినా ఆయనే మా ఎమ్మెల్యే!

Telangana Politics: గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా.. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో మాత్రం మెజార్టీ స్థానాలను గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. 10 అసెంబ్లీ స్థానాలకు ఏకంగా ఏడు స్థానాలను గెలుచుకుంది. అంతవరకు బాగానే ఉన్నా.. అధికారం దక్కకపోవడంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు.. ఏ పని చేయాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఇక సంగారెడ్డి జిల్లాకు వస్తే.. గత ఎన్నికల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి పై 10 వేల మెజార్టీతో గెలిచారు. చింతా ప్రభాకర్ ఎమ్మెల్యేగా అయితే గెలిచారు కానీ.. కేడర్ అడిగిన ఒక్కటంటే ఒక్క పనిని కూడా చేయించలేకపోతున్నారట. దీంతో పనుల కోసం జగ్గారెడ్డే దిక్కు అన్నట్లుగా తయారైంది సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల పరిస్థితి.

Also Read: KT Rama Rao: 'కుల గణన సర్వే తప్పుల తడక.. పదేండ్ల తర్వాత బీసీ జనాభా ఎలా తగ్గింది?'

జగ్గారెడ్డే దిక్కు!
ఇక చింతా ప్రభాకర్‌తో పనులు కావని డిసైడైన వారంతా హైదరాబాద్ బాటపడుతున్నారని తెలుస్తోంది. ముఖ్యమైన పని కావాలంటే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా హైదరాబాద్‌లో జగ్గారెడ్డిని కలుస్తున్నారట. దీంతో రోడ్ల మరమ్మతుల నుంచి.. కాలనీల్లోని సమస్యల పరిష్కారం వరకు.. అన్నింటికి జగ్గారెడ్డే దిక్కు అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయట. ఇక రాష్ట్ర స్థాయిలో డైనమిక్ లీడర్‌గా పేరున్న జగ్గారెడ్డి సంగారెడ్డిలో మాత్రం ఒక అపవాదును మూటగట్టుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండరు. కనీసం ఫోన్‌లో కూడా దొరకరు అని జగ్గారెడ్డిపై ఎప్పటినుంచో ప్రచారం ఉంది. అందుకేనేమో ప్రజా సమస్యలను పరిష్కరించే బాధ్యతను తన సతీమణి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డికి అప్పగించారట. దీంతో ఆమె  ప్రజల సాదకబాధకాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారట. సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉండరు అనే అపవాదును నిర్మలా జగ్గారెడ్డి తొలిగించే ప్రయత్నం చేస్తున్నారట. అటు ప్రభుత్వ కార్యక్రమమైనా.. పేదింటి కార్యక్రమమైనా దగ్గరుండి జరిపిస్తున్నారట నిర్మల.

Also Read: Revanth Reddy: దేశంలోనే తొలిసారి తెలంగాణలో కులగణన చేసి చరిత్ర సృష్టించాం

ఓటమి తప్పలేదు
సంగారెడ్డి ఎమ్మెల్యేగా జగ్గారెడ్డి మూడు పర్యాయాలు గెలిచారు. 2018 ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు. కానీ అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఆయన చాలావరకు ప్రజా సమస్యలను నేరుగా తీర్చలేకపోయారట. తమ ప్రభుత్వం అధికారంలో లేకపోయినా.. కొన్నిసార్లు అప్పటి మంత్రులు హరీశ్‌ రావు, కేటీఆర్ దగ్గరకు వెళ్లి మరి అత్యవసరమైన ప్రజా సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపించారు. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం జగ్గారెడ్డికి ఓటమి తప్పలేదు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా ప్రజల్లో జగ్గారెడ్డి కనిపించరనే అపవాదుతోనే ఓటమి పాలయ్యారనే విమర్శ ఉంది. అయితే ఎన్నికల్లో ఓడినా.. గెలిచినా.. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో జగ్గారెడ్డి ముందుంటారు అనే పేరుంది. పేదలకు సాయం చేయడంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందూ వెనక ఆలోచించరన్న పేరును జగ్గారెడ్డి సంపాదించుకున్నారు. అంతేకాదు కపటం లేని మనిషిగా.. ఏదైనా ముఖం మీదే చెప్పే వ్యక్తిగా జగ్గారెడ్డికి సంగారెడ్డిలో పేరుంది.

కాంగ్రెస్‌కు భారీగా వలసలు
ఇదిలా ఉంటే ప్రస్తుత ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాత్రం పేరుకే ఎమ్మెల్యే అన్నట్లుగా మారిపోయారనే చర్చ జరుగుతోంది. ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎవరైనా తన వద్దకు వస్తే.. రాష్ట్రంలో మన ప్రభుత్వం అధికారంలో లేదు.. చేద్దాం.. చూద్దాం అని వచ్చినవాళ్లకు చెప్పి పంపేస్తున్నారట. దీంతో బీఆర్ఎస్ పార్టీ కేడర్ కూడా ఆలోచనలో పడిందని టాక్. పనులు కావాలంటే పార్టీ మారాల్సిందేనా అని సన్నిహితులతో సమాలోచనలు చేస్తున్నారట. ముఖ్యంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలోపు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌కు భారీగా వలసలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పనిచేసిన వారు.. సర్పంచ్‌లుగా పనిచేసి.. బిల్లులు పొందలేని వాళ్లంతా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తేనే భవిష్యత్ బాగుంటుందని చర్చించుకుంటున్నట్లు టాక్. 

ఇక రాష్ట్రంలో అధికారంలో లేకపోవడంతోనే చింతా ప్రభాకర్ తన అనుచరగణానికి పనులు చేయలేకపోతున్నారని కొందరు అనుకుంటుంటే.. ఏళ్ల తరబడి పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నవారు తమ మనసులోని మాటను మరోలా బయటపెడుతున్నారట. పదేళ్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రూల్స్ పేరుతో కొన్నిసార్లు.. అప్పటి మంత్రి హరీశ్‌ రావుతో మాట్లాడుదామని చెప్పి కొన్నిసార్లు మాట దాట వేసేవారట. దీంతో పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేని ప్రభాకర్ ఇప్పుడేం చేస్తారని కిందిస్థాయి నాయకులు నిర్మొహమాటంగా విమర్శలు చేస్తున్నారట. ఇక ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు ఇలా ఒకరిద్దరు కాదు.. బీఆర్ఎస్ పార్టీని వెన్నంటే ఉన్న వాళ్లలో చాలా మంది భావన ఒక్కటేనట. రాష్ట్రంలో మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే పనులకు, పైరవీలకు మొకాలడ్డిన ఎమ్మెల్యే ఇప్పుడేం చేస్తారని కొంతమంది ముఖ్యనేతలు కూడా చెవులు కొరుక్కుంటున్నారట. ఏదేమైనా సంగారెడ్డి ఎమ్మెల్యే మొక్కుబడి ఎమ్మెల్యేనేనా అనే చర్చ అయితే నియోజరవర్గంలో విస్తృతంగా నడుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News