KTR Comments on Results: జనవరి 3వ తేదీన ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంతో ప్రారంభమైన బీఆర్ఎస్ పార్టీ సన్నాహాక సమావేశాలు సోమవారం నల్లగొండతో ముగిశాయి. పార్లమెంట్ సెగ్మెంట్లవారీగా పార్టీ ముఖ్య నాయకులతో చర్చలు జరిపింది. ఆఖరి రోజున నల్లగొండ సెగ్మెంట్‌పై నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి వచ్చిన ఫలితాలను చూసి విస్మయం చెందినట్లు తెలిపారు. ఎక్కడా ఓటమిపై అనుమానాలు లేవని.. కానీ ఫలితాలు మాత్రం వేరుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయని పేర్కొన్నారు.
సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. 'బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులు. కార్యకర్తల వల్లే దశాబ్దాలుగా పార్టీ బలంగా ఉంది. 16 లోక్‌సభ సమావేశాల తీరు చూస్తే కార్యకర్తలే పార్టీకి ధైర్యం అని రుజువు చేసింది' అని తెలిపారు. నల్లగొండలో ఎన్నికల ప్రచార సరళి మనకు అనుకూలంగా ఉన్నట్టే అనిపించిందని పేర్కొన్నారు. 'ఎక్కడా ఓటమిపై అనుమానాలు రాలేదు. ఎన్నికల ఫలితాలు మరోలా వచ్చాయి. సూర్యాపేటలో మాత్రమే గెలిచాం' అని గుర్తుచేశారు. 'పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి ఎదురైందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు' అని చెప్పారు.
నల్లగొండ లోక్ సభ నియోజక వర్గ సన్నాహాక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
జనవరి 3 ఆదిలాబాద్ తో ప్రారంభమైన సమావేశాలు నేడు నల్లగొండతో ముగుస్తున్నాయి
నేటితో మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాల సమావేశాలు పూర్తవుతున్నాయి
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులు… pic.twitter.com/Brk0zNVQDe
— BRS Party (@BRSparty) January 22, 2024
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టలేకపోయినట్లు పేర్కొన్నారు. అవతలి వాళ్లు అభూత కల్పనలు, అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని చెప్పారు. 'మనం ఇంకా మాట్లాడటం మొదలు పెట్టనే లేదు.. కాంగ్రెస్ వాళ్లు ఉలిక్కి పడుతున్నారు. ఇక పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో ఉహించుకోండి' అని కేటీఆర్ పార్టీ శ్రేణులతో తెలిపారు.
ఈ సందర్భంగా సమావేశంలో కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. 'అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ వాళ్లు కూడా కలగన లేదు. అందుకే ఇష్టమొచ్చినట్టు హామీలు గుప్పించారు. హామీలకు కాంగ్రెస్ పంగనామాలు పెట్టె ప్రయత్నం చేస్తోoది.. అయినా వదిలి పెట్టం' అని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్ రెడ్డి అడ్డమైన మాటలు చెప్పారని గుర్తుచేశారు. కార్యకర్తలు ఉదాసీన వైఖరి మీమాంస వీడాలని సూచించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడారు. ఇపుడేం చేస్తున్నారో ప్రజలకు విడమరచి చెప్పాలని దిశానిర్దేశం చేశారు.
కరెంట్ బిల్లులపై తాను చేసిన వ్యాఖ్యలను మరోసారి ప్రస్తావించారు. 'కోమటి రెడ్డి గత నవంబర్లోనే కరెంటు బిల్లులు కట్టవద్దని చెప్పారు. నల్లగొండ ప్రజలు బిల్లులు కట్టకుండా కోమటి రెడ్డికే పంపండి' అని ప్రజలకు కేటీఆర్ సూచించారు. సాగర్ ఆయకట్టుకు కాంగ్రెస్ పాలనలో మొదటి సారి క్రాప్ హాలీడే ప్రకటించే దుస్థితి దాపురించింది అని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించి తెలంగాణ జుట్టును కాంగ్రెస్ కేంద్రం చేతిలో పెడుతోందని చెప్పారు. శ్రీ రాంసాగర్ చివరి ఆయకట్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎండ బెడుతోందని వివరించారు.
కరెంటు కోతలు అపుడే మొదలయ్యాయని కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్, బీజేపీ అక్రమ బంధం నల్లగొండ మున్సిపాలిటీ అవిశ్వాసంలో బయటపడిందని చెప్పారు. రేవంత్ భుజం మీద తుపాకీ పెట్టి మోడీ బీఆర్ఎస్ను కాలుస్తారట అని తెలిపారు. మైనారిటీ సోదరులకు కాంగ్రెస్, బీజేపీ అక్రమ సంబంధం గురించి చెప్పాలని పార్టీ శ్రేణులకు సూచించారు. 'రాహుల్ అదానీని దొంగ అన్నారు రేవంత్ దొర అంటున్నాడని పేర్కొన్నారు.
పార్టీ అధినేత కేసీఆర్‌పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉందని.. ఈ పరిస్థితిని పార్లమెంటు ఎన్నికల్లో సానుకూలంగా మలచుకోవాలని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే అనేక వర్గాలు దూరమయ్యాయని.. వారికి దగ్గరవ్వాలని సూచించారు. నల్లగొండ పార్లమెంటు ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి గెలుద్దామని పిలుపునిచ్చారు. ఈ పార్లమెంటు సన్నాహాక సమావేశాలు ఆరంభం మాత్రమేనని తెలిపారు. పార్లమెంట్‌పై సమావేశాలు ముగియడంతో ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు మొదలవుతాయని కేటీఆర్ ప్రకటించారు.
Also Read: Rahul Gandhi No Entry: అయోధ్య ప్రాణప్రతిష్ట వేళ.. రాహుల్ గాంధీకి చేదు అనుభవం
Also Read: Ayodhya Devotee Suffer Heart Attack: అయోధ్య ఆలయంలో కుప్పకూలిన భక్తుడు .. రక్షించిన భారత వాయుసేన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook