టీమిండియా బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ కరీబియన్ బాట పట్టడం ఏంటని ఆశ్చర్య పోకండి... ఐపీఎల్ తరహా విండీస్ లో కరీబియన్ లీగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ లీగ్ లో పాల్గొనేందుకు వివిధ దేశాల క్రికెటర్లు పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఇర్ఫాన్ పఠాన్ కూడా దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయాన్ని సీపీఎల్ తన అధికారిక వెబ్సైట్లో తెలిపింది.
ఇర్ఫాన్ బాటలో మరికొందరు క్రికెటర్లు..
సెప్టెంబర్ 4 నుంచి అక్టోబర్ 12 వరకూ జరగనున్న కరేబియన్ లీగ్‌లో ఆడేందుకు పఠాన్‌తో పాటు ఐపీఎల్ స్టార్స్ రషీద్‌ఖాన్, షకిబుల్ హాసన్, జొఫ్రా ఆర్చర్, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జేపీ డుమినీ, ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ కూడా తమ పేర్లను సమర్పించినట్లు తెలిసింది. కరేబియన్ లీగ్‌లో ఆడేందుకు ఇప్పటికే 500 మందికి పైగా విదేశీ ఆటగాళ్లు దరఖాస్తులు చేసుకున్నట్లు సీపీఎల్ ప్రకటించింది
సరికొత్త రికార్డుకు చేరువలో ఇర్ఫాన్ పఠాన్
ఇప్పటి వరకూ భారత్ నుంచి ఏ ఆటగాడు ఈ లీగ్‌లో ఆడలేదు. దీంతో కరీబియన్ లీగ్ లో ఏ జట్టు యాజమాన్యం అయినా సరే పఠాన్‌ను తీసుకుంటే కరీబియన్ లీగ్‌లో ప్రాతినిధ్యం వహించిన తొలి భారత ఆటగాడుగా ఇర్ఫాన్ చరిత్ర సృష్టిస్తాడు. టీమిండియాకు ప్రధాన బౌలర్ గా ఎదిగిన ఇర్ఫాన్ పఠాన్ ఫామ్ లేమితో చాలా కాలం నుంచి జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. వరల్డ్ కప్ జట్టులోనూ ఇర్ఫాన్ కు చోటు దక్కలేదు.