ప్రపంచ క్రికెట్లో మళ్లీ ఫిక్సింగ్ ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇది స్పాట్ ఫిక్సింగో, మ్యాచ్ ఫిక్సింగో కాదు. పిచ్ ఫిక్సింగ్. గల్ఫ్‌కు చెందిన ప్రముఖ న్యూస్ ఛానల్ అల్ జజీరా తన స్టింగ్ ఆపరేషన్‌లో ఫిక్సింగ్ జరిగినట్టు తేలిందని ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. క్రికెట్ అవినీతిపై తాము నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో మూడు టెస్టు మ్యాచ్‌లు ఫిక్సింగ్ అయ్యాయని పేర్కొంది. గత రెండేళ్ల కాలంలో భారత్ ఆయా దేశాలతో ఆడిన మూడు టెస్టులు ఫిక్సింగ్ కోరల్లో చిక్కుకున్నట్టు తమ ఆపరేషన్‌లో తేలిందని స్పష్టం చేసింది.
2017లో శ్రీలంకలోని గాలే స్టేడియంలో భారత్-లంక జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్, 2017లో రాంచీలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్, 2016 డిసెంబర్లో ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య చెన్నైలో జరిగిన టెస్టు మ్యాచ్‌లలో ఫిక్సింగ్ జరిగిందంటూ బుకీలతో మాట్లాడిన వీడియోని ఆల్ జజీరా ఛానెల్ ప్రసారం చేయడంతో ఐసీసీ విచారణ విభాగం దర్యాప్తు చేపట్టింది.
పైన పేర్కొన్న రెండు టెస్టుల్లో భారత్ విజయం సాధించగా, రాంచీ టెస్టు డ్రాగా ముగిసింది. గాలేలో జరిగిన టెస్టులో భారత్ చేతిలో 304 పరుగుల తేడాతో ఘోరంగా పరాజయం పాలైంది. రాంచీ టెస్టులో ఇద్దరు ఆస్ట్రేలియా క్రికెటర్లు, చెన్నైలో జరిగిన టెస్టులో ముగ్గురు ఇంగ్లాండ్ క్రికెటర్లు ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఛానల్ పేర్కొంది.