YS Jagan Emotional After Tributes To YS Abhishek Reddy: అనారోగ్యంతో మృతి చెందిన తన సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డికి మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. కడప జిల్లా పులివెందులలో అభిషేక్ రెడ్డి అంత్యక్రియల్లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దంపతులు హాజరై భావోద్వేగానికి లోనయ్యారు.
వైఎస్ కుటుంబంలో ఇటీవల తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరుడు హఠాన్మరణం పొందడంతో వైఎస్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.
అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్లో ఈనెల 7వ తేదీన మృతిచెందిన అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు కడప జిల్లా పులివెందులలో నిర్వహించారు.
వైఎస్ ప్రకాశ్ రెడ్డి మనుమడు వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్కు సోదరుడి వరుస అవుతాడు. అతడి మృతితో జగన్ పులివెందులకు చేరుకున్నారు.
తన సతీమణి వైఎస్ భారతితో కలిసి అభిషేక్ రెడ్డి అంత్యక్రియల్లో జగన్ పాల్గొన్నారు. పుష్పాంజలి ఘటించిన అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
వైఎస్ అభిషేక్ రెడ్డి కుటుంబపరంగానే కాకుండా రాజకీయాల్లో జగన్కు సహకారంగా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగ రాష్ట్ర కార్యదర్శిగా వైఎస్ అభిషేక్ రెడ్డి బాధ్యతలు నెరవేర్చిన విషయం తెలిసిందే.
గతేడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కడప జిల్లా లింగాల మండల ఇన్చార్జిగా అభిషేక్ రెడ్డి వైఎస్సార్సీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. అతడి మృతితో వైఎస్ కుటుంబంతోపాటు వైఎస్సార్సీపీలోనూ తీవ్ర విషాదం అలుముకుంది. అంత్యక్రియల్లో వైసీపీ శ్రేణులు కూడా భారీగా పాల్గొన్నాయి.